ఇక పల్లెల్లో సౌర వెలుగులు! | Sakshi
Sakshi News home page

ఇక పల్లెల్లో సౌర వెలుగులు!

Published Sun, Aug 3 2014 1:38 AM

ఇక పల్లెల్లో సౌర వెలుగులు! - Sakshi

- కరెంటు కొరతకు అధిగమించేందుకు సర్కార్ ప్లాన్
- సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం
- 3 గ్రామాల్లో పెలైట్ ప్రాజెక్ట్
- ఫలిస్తే తెలంగాణ అంతటా అమలు

 సిద్దిపేట రూరల్: తెలంగాణను పట్టిపీడిస్తున్న కరెంటు కొరతను అధిగమించేందుకు సర్కార్ ప్లాన్ సిద్ధం చేసింది. గుజరాత్ లాగా మన రాష్ట్రంలోనూ సౌర విద్యుత్‌తో పల్లెల్లో వెలుగులు నింపాలని భావిస్తోంది. ఇందుకోసం సిద్దిపేట కేంద్రంగా ప్రయోగం ప్రారంభించింది. సోలార్ ప్రాజెక్టు ప్రయోగం కోసం సిద్దిపేట మండలంలోని మూడు గ్రామాలను ఎంపిక చేసిన సర్కార్ నాలుగు దశల్లో ఇక్కడ ప్రయోగాలు చేసి ఫలితాలను సమీక్షించాక సౌరకాంతులను తెలంగాణ అంతటా ప్రసరింపజేయాలని భావిస్తోంది.
 
గుజరాత్‌ను ఆదర్శంగా...
బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్ సర్కార్ కరెంటు కొరతను అధిగమించడమే ప్రధాన లక్ష్యంగా ఎం చుకుంది. ఇందుకోసం గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని సోలార్ ప్రాజెక్టు చేపట్టింది. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సూచన మేరకు సిద్దిపేట కేంద్రంగా నాబార్డ్, మెడ్‌క్యాబ్‌లఆధ్వర్యంలో సోలార్ ప్రాజెక్టు చేపట్టిన అధికారులు  కార్యాచరణ ప్రారంభించారు. సోలార్ ప్రయోగాలకు వేదికలుగా నిలిచిన  సిద్దిపేట మండలం ఎల్లుపల్లిలో ఆండ్రోమెడ సోలార్ పవర్ ప్యాక్ కంపెనీ, బంజారుపల్లిలో టాటా సోలార్, కోదండరావుపల్లిలో సైబర్ మోషన్ కంపెనీలు సోలార్ పరికరాలను అమర్చడం, సరఫరా చేయడం బాధ్యతలను స్వీకరించాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల ప్రతినిధులు శనివారం గ్రామాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
 
వీరికి విద్యుత్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల అధికారులు సహకరిస్తున్నారు. తొలిదశలో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేసి సౌర శక్తితో తయారైన విద్యుత్‌ను గ్రామాల్లోని అన్ని ఇళ్లకు సరఫరా చేస్తారు. ఈ ప్రయోగ ఫలితాన్ని పరిశీలించిన అనంతరం రెండో దశలో గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసి పంపుసెట్లకు సౌరశక్తిని సరఫరా చేస్తారు. మూడో దశలో ఉత్పత్తి చేసిన సౌర శక్తిని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా సరఫరా చేసే విధానాన్ని అమలు పరుస్తారు. ఈ మూడు దశల అనంతరం ఏవైనా లోపాలు తలెత్తితే వాటిని సవరించి పక్కాగా సౌర విద్యుత్‌ను తయారు చేసి గ్రామంలోని అన్ని విద్యుత్ అవసరాలకు సరఫరా చేస్తారు.
 
ఈ మూడు గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌లు విజయవంతమైన అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు దశల వారీగా విస్తరించడానికి నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు సోలార్ కంపెనీల ప్రతినిధులు చర్చలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని విద్యుత్ వినియోగంపై సర్వే ప్రారంభమైంది. 15 రోజుల్లో ఈ సోలార్ పవర్ పెలైట్ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Advertisement
Advertisement