నౌకరి కోసం కొట్లాడుండ్రి | Sakshi
Sakshi News home page

నౌకరి కోసం కొట్లాడుండ్రి

Published Thu, Aug 17 2017 2:37 AM

నౌకరి కోసం కొట్లాడుండ్రి

టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం  
 
సాక్షి, ఖమ్మం: తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశించి ప్రాణ త్యాగాలు చేసిన అమరుల స్ఫూర్తితో యువత ఐక్యమై నౌకరి కోసం ఉద్యమించాలని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. బుధవారం ఏఐ వైఎఫ్‌ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన నిరుద్యోగ సదస్సులో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడితే, ప్రభుత్వం కేవలం 20 వేల పోస్టుల భర్తీ మాత్రమే చేపట్టిందన్నారు. ఇంకా 1.80 లక్షల ఖాళీలు ఉన్నాయని, 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించినా ఆచరణలో మాత్రం కనబడటం లేదని ఆరోపించారు.

నెలలు గడుస్తున్నా ఎస్‌ఐ పరీక్షల ఎంపిక ఫలితాలను విడుదల చేయడం లేదని, వాటిపై స్పష్టత అడిగిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వెంటనే ఉద్యోగ క్యాలెండర్‌ను ఆవిష్కరించి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  దసరా తర్వాత హైదరాబాద్‌లో భారీ సదస్సు నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.   

Advertisement
Advertisement