కోదండరాం గో బ్యాక్‌ | Sakshi
Sakshi News home page

కోదండరాం గో బ్యాక్‌

Published Sat, Apr 29 2017 1:56 AM

కోదండరాం గో బ్యాక్‌ - Sakshi

- మార్కెట్‌యార్డుల సందర్శనకు వచ్చిన జేఏసీ చైర్మన్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
- టీజేఏసీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య తోపులాట.. ఉద్రిక్తత


సూర్యాపేట వ్యవసాయం/ యాదాద్రి/ మోత్కూరు: రైతుల సమస్యలను తెలుసుకు నేందుకు యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లోని మార్కెట్‌ యార్డులను సందర్శించేందుకు వచ్చిన జేఏసీ చైర్మన్‌ కోదండ రాంను టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునేం దుకు యత్నించారు. కోదండరాం గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ, టీఆర్‌ఎస్‌ నాయకులు మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని గంజ్, మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు, సూర్యాపేట మార్కెట్‌ యార్డులను కోదండరాం బృందం సందర్శించింది.

ఈ సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున మార్కెట్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో రైతుల నుంచి వివరాలు సేకరిస్తుండగా కోదండరాం గో బ్యాక్, జేఏసీ డౌన్‌డౌన్, కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్‌ రైతులకు ఎంతో చేశారని, రాజకీయ పబ్బం కోసం కోదండరాం రాద్ధాంతం చేస్తున్నారని వారు మండిపడ్డారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, జేఏసీ బృందం మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.  

తల తెగిపడ్డా వెనకడుగు వేయను
రైతుల సమస్యలపై పోరాటంలో తన తల తెగిపడ్డా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కోదండరాం అన్నారు. శుక్రవారం సూర్యాపేట మార్కెట్‌యార్డులో ఆయన విలేకరులతో మాట్లాడారు.  ప్రజాస్వామ్యబద్ధంగా తాము మార్కెట్‌కు వస్తే టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడం సరైంది కాదని, తాము ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్లకూడదో నిర్ణయించ డానికి వీళ్లెవరని ప్రశ్నించారు. మార్కెట్లలో రైతులు అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు.

ప్రైవేట్‌ వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని కొంటున్నారని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకుందామంటే రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు.  రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జేఏసీ శక్తులను కలుపుకుని జూన్‌ 9 నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రైవేట్‌ అప్పులబారిన పడకుండా బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement