కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు | Sakshi
Sakshi News home page

కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు

Published Thu, Mar 17 2016 2:15 AM

కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు

ఎదురుగాలి
కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు
 
టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ప్రత్యర్థులు  
కార్పొరేటర్ల టికెట్లలో అనుచరులకు కోత
మేయర్ అభ్యర్థి ఎంపికలో చెల్లుబాటుకాని మాట

 
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు ఉన్న కొండా మురళీధర్‌రావుకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవితో మురళీధర్‌రావు టీఆర్‌ఎస్‌లో తిరుగులేని నేతగా మారారని ఆయన అనుచరులు అప్పట్లో భావించారు. దాని తర్వాత అంతగా ప్రాధాన్యం దక్కడం లేదు. సురేఖకు మంత్రి పదవి రాకపోవడం.. ప్రత్యర్థులు టీఆర్‌ఎస్‌లో చేరడం.. కార్పొరేటర్ టికెట్లలో కోత.. ఆ తర్వాత మేయర్ ఎన్నిక.. ఇలా అన్ని విషయాల్లోనూ కొండా మురళికి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతున్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది.
 
2014 ఎన్నికల ముందు కొండా మురళీధర్‌రావు, కొండా సురేఖ టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు వీరితో కలిసి గులాబీ పార్టీలోకి మారారు. సాధారణ ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి బస్వరాజు సారయ్యపై ఘన విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌లో చేరిక సమయంలో పార్టీ  అధిష్టానం ఇచ్చిన హామీ ప్రకారం సురేఖకు మంత్రి పదవి వస్తుందని కొండా వర్గీయులు భావించారు. అప్పట్లో ఇది జరగలేదు. ఏడాది తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి అజ్మీరా చందులాల్‌కు అవకాశం వచ్చింది. కొండా కుటుంబానికి రెండోసారి కూడా అవకాశం రాలేదు. వరంగల్ తూ ర్పు నియోజకవర్గానికి చెందిన రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి పదవి రా కపోవడంతో పాటు తన నియోజకవర్గంలో మరో నేత సుధారాణి చేరడంతో కొండా మురళి కొన్ని నెలలు స్తబ్ధుగా ఉండిపోయారు.

గత సంవత్సరం డిసెంబరులో టీఆర్‌ఎస్ అధిష్టానం కొండా మురళీధర్‌రావుకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. మురళి తన రాజకీయ చాతుర్యంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామంతో ఆయన జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు మళ్లీ పాత పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలకు ముం దే వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇం చార్జీ బస్వరాజు సారయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖకు ప్రత్యర్థిగా పోటీచేసిన సారయ్యతో పాటు మురళి చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా టీ ఆర్‌ఎస్‌లో చేరడం వీరికి కొంత ఇబ్బందిగా మారింది.

కాగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికల సందర్భంగా కార్పొరేటర్ల టికెట్ల కేటాయింపు, ప్రచార వ్యూహంపై జిల్లా స్థాయిలో తొమ్మిది మందితో నియమించిన సమన్వయ కమిటీలో ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కొండా సురేఖకు చోటు కల్పించారు. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యం దక్కుతుం దని కొండా అనుచరులు భావించారు. కానీ, కొండా మురళీధర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన వారిలో ఐదారుగురికి కార్పొరేటర్ టికెట్లు దక్కలేదు. దీనికితోడు తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజ న్లలో స్వతంత్రుల పోటీ విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. వీరిని పోటీ నుంచి తప్పించే విషయంలో కొండా మురళి పూర్తిగా సక్సెస్ కాకపోగా, మూడు డివిజన్లలో రెబల్స్ విజయం సాధించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. చివరికి మేయ ర్ పదవి విషయంలోనూ మురళీధర్‌రావు మాట చెల్లుబాటు కాలేదు. మురళికి అసంతృప్తి కలిగించేలా టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని ఆయన వర్గీయులు అంటున్నారు. నన్నపునేని నరేందర్ మే యర్‌గా ఎన్నిక కావడం మురళీధర్‌రావుకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం టీఆర్‌ఎస్‌లో వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితులలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు ఇకపై ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
 

Advertisement
Advertisement