పుష్కరాల పనులు పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

పుష్కరాల పనులు పూర్తి చేయాలి

Published Thu, Apr 7 2016 5:24 AM

పుష్కరాల పనులు పూర్తి చేయాలి - Sakshi

కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడొద్దు
అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి
జూన్ చివరినాటికి పనులు పూర్తవ్వాలి

 
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కృష్ణా పుష్కరాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ విశ్వప్రసాద్‌తో కలిసి కృష్ణా పుష్కరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగష్టులో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాలకు ఆయా శాఖల ద్వారా చేపట్టే పనులను జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి పుష్కర ఘాట్‌కు ఒక ప్రత్యేక అధికారిని పర్యవేక్షణ కోసం నియమిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో జాతీయ రహదారి ఉన్నందు వల్ల పుష్కరాలకు ఇతర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రానున్నందున ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.


పుష్కరఘాట్ల ప్రాముఖ్యతను, దేవాలయాల ప్రాముఖ్యతను తెలిపేలా కరపత్రాలు, ఫొటోలను సేకరించాలని సూచించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే అన్నిపనులు సవ్యంగా జరుగాతాయని అన్నారు. అలాగే పుష్కరాలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎస్పీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా దూరదృష్టి ఆలోచించి చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సర్వీసు రోడ్స్ ముందే పూర్తిచేస్తే బాగుంటుందని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.రాంకిషన్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, మాడ పీఓ వెంకటయ్య, జిల్లా అధికారులు రామ్‌కోటారెడ్డి, జోత్స్న, రమణారాజు, సోమిరెడ్డి, రాజేందర్, డీఎస్పీలు, ఆర్డీఓలు పాల్గొన్నారు.
 
‘పాలమూరు’ ఎత్తిపోతలలో నిర్లక్ష్యం వద్దు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ శ్రీదేవి చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఆర్‌డీఓలు, ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియను వేగంగా నిర్వహించాలని, రిజిస్ట్రేషన్‌లను త్వరితగతిన పూర్తిచేసేలా చూడాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ రాంకిషన్, డ్వామ పీడీ కె.దామోదర్‌రెడ్డి, డీపీఓ వెంకటేశ్వర్లు, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజనీర్లు, తహసీల్దార్లు, ఆర్‌డీఓలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement