వలస బతుకులకు.. చెరువు ఆదరువు! | Sakshi
Sakshi News home page

వలస బతుకులకు.. చెరువు ఆదరువు!

Published Sat, Jun 16 2018 1:31 AM

Krishna Water to the Khanapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలమూరు అంటేనే ఆకలి చావులు.. రైతు ఆత్మహత్యలకు అడ్డా. పసిపిల్లలను, పండుటాకులకు వదిలేసి వలసపోయే కూలీల గడ్డ. నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామ పంచాయతీలోని గ్రామం ఖానాపురం కూడా అలాంటిదే. తూర్పున ఈడిగోనికుంట.. పడమరన పల్జోనికుంట.. దక్షిణాన కటికోనికుంట, ఉత్తరాన నడిపోనికుంటలతో ద్వీపం లాంటి ఈ ఊరు తరతరాలుగా నీళ్లు లేక తల్లడిల్లింది. 85 కుటుంబాలు, 360 ఎకరాల సాగు భూమి ఉన్న ఖానాపురంలో 2016 వరకు పుట్టెడు ధాన్యం పండిందిలేదు. ఊరు ఊరంతా వలసలతోనే కాలం వెళ్లదీసింది. అలాంటి పల్లెకిప్పుడు మంత్రి హరీశ్‌రావు కృష్ణమ్మనే పట్టుకొచ్చారు. ఎండిన కుంటల్లో నీళ్లు నింపి వలసపోయినోళ్లందరినీ పల్లెకు రమ్మని పిలిచి కృష్ణా జలాలతో రైతన్నల పాదాలు కడిగారు. 

వలసే ఉపాధి: 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఖానాపురంలో వ్యవసాయం చేసుకుంటూ బతికిన ఒక్క కుటుంబమూ లేదు. అందరూ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కడ పని దొరికితే అక్కడికి వలసపోయి బతికేటోళ్లే. వలస పోకపోతే ఆకలి చావులే. 2001లో అసెంబ్లీని కుదిపేసిన గాదం పురుషోత్తం ఆకలి చావు సంఘటన జరిగింది ఇక్కడే. 2016లో మిషన్‌ కాకతీయ కింద నడిపోనికుంటకు రూ.16 లక్షలు, కటికోనికుంటకు రూ.17.50 లక్షలు, ఈడిగోనికుంటకు రూ.8.50 లక్షలు ఖర్చు చేసి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పూడిక తీయించారు. పల్జోనికుంటలో ఉపాధిహామీ కింద మట్టి తీయించారు. ఈ కుంటలను కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌ కాల్వకు అనుసంధానం చేశారు. ఒకేసారి కుంటలు నిండాయి. 

గూటికి చేరిన వలస పక్షులు 
చెరువుల్లోకి నీళ్లు రావటంతో వలస పక్షులన్నీ సొంత గూటిని చేరుకున్నాయి. నీళ్లు పుష్కలంగా ఉండటంతో ముక్కారు పంటలు పండు తున్నాయి. ‘నాకున్న ఐదున్నర ఎకరాల్లో ఎన్న డూ ఇత్తు పండలే. మహారాష్ట్ర, గుజరాత్‌.. ఎక్కడ పనిదొరికితే అక్కడికేపోయి బతికిన. రెండేళ్ల నుంచి కాల్వ నీళ్లు సెరువులకు మళ్లి పంటలు పండుతున్నాయి. పోయినేడు 8 పుట్ల వరి పండింది. ఐదు బస్తాల బుడ్డలైనయి’అని 52 ఏళ్ల రైతు కుర్మయ్య అన్నాడు. ‘కరువులనే పుట్టిన.. కరువులనే పెరిగిన. నాకు 14 మంది పిల్లలు పుట్టి.. తిండి సరిగా లేక 11 మంది చనిపోయిండ్రు. ఈ రెండేళ్ల నుంచి పంటలు పండుతున్నయి. ఎకరం వరి పెట్టిన. రెండు పుట్ల వరి గింజలు వచ్చినయి. చిన్నబిడ్డను బడికి పంపు తున్న. వరి అన్నమే తింటున్నం. అప్పుడప్పుడు ఇంత కూర (మాంసం) కూడ తింటున్నం’అని 70 ఏళ్ల రైతు ఆదే స్వామి చెప్పుకొచ్చాడు. 

ప్రతి గ్రామం ఖానాపురం కావాలె 
వలసపోయిన ఊరు మళ్లీ తిరిగొచ్చి వ్యవసాయం చేసుకుంటుదంటే చాలా ఆనందంగా ఉంది. 85 కుటుంబాల్లో 81 కుటుంబాలు ఇప్పుడు ఊరిలోనే ఉన్నాయి. కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చి ప్రతి పల్లెను ఖానాపురం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం. ఈ క్రతువు నా ద్వారా జరగటం చాలా సంతోషాన్నిస్తోంది.  
    – హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి 

అమ్మొళ్లు పొలానికి..నేను, తమ్ముడు బడికి
అమ్మానాయిన వలసపోతుంటే వాళ్లతో కలిసి మహారాష్ట్రకు పోయిన. అమ్మొళ్లు పనికి పోతే నేను తమ్మున్ని పట్టుకొని ఉండేదాన్ని. అప్పుడప్పుడు భివండీలో తెలుగోళ్ల బడికి పోయేదాన్ని. రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నం. అమ్మొళ్లు పొలా నికి పోతే నేను, తమ్ముడు బడికి పోతున్నం. 
    – గాయత్రి  

Advertisement
Advertisement