ఆనంద సాగరం | Sakshi
Sakshi News home page

ఆనంద సాగరం

Published Wed, Sep 20 2017 1:05 PM

ఆనంద సాగరం - Sakshi

మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు..
పెరగనున్న ఆయకట్టు


మహబూబ్‌నగర్‌ నుంచి గంగాపురం ప్రతాప్‌రెడ్డి :
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఉన్న కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కేవలం రూ. 85 లక్షలతోనే పూర్తయిందంటే నమ్మలేం. కానీ ఇది నిజం. నిజాం కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. 1947లో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 1955లో పూర్తి చేశారు. ప్రాజెక్టు అలుగు స్థాయి ఎత్తు 27 అడుగులు. ఎడమ కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టు ఆయకట్టు మరింత పెంచి 50వేల ఎకరాలకు నీరందేలా చర్యలు చేపట్టారు. అందుకు తగ్గట్టు కాల్వల లైనింగ్, కొత్త కాల్వల నిర్మాణం యుద్ధప్రాతిపదికన జరుగుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడా కూడా సిమెంట్‌ ఉపయోగించలేదు. కేవలం అప్పట్లో అందుబాటులో ఉన్న సున్నం, గచ్చు కలిపి రాతి కట్టడంతో ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 62 సంవత్సరాలు కావస్తున్నా ప్రాజెక్టు నేటికి చెక్కుచెదరలేదు.

1981లో క్రస్టుగేట్ల నిర్మాణం..
కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టును ఆధునికీకరించే పనులు 1981లో చేపట్టారు. అలుగుపై క్రస్టుగేట్ల నిర్మాణంచేసి ప్రాజెక్టు కట్టను రెండు వైపులా ఆరు అడుగుల వరకు పెంచి బలోపేతం చేశారు. దీనికి రూ.92 లక్షల వ్యయం అయింది.

వైఎస్సార్‌ వల్లే కృష్ణా జలాలు..
కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు చెప్పుకోదగిన వరద వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్టు బోసిపోయి ఆయకట్టుకు నీరిచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఙంలో భాగంగా 2006లో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడానికి ఈ పథకం కోసం రూ. 359 కోట్లతో అంచనాలు తయారు చేయించారు. అంతేకాకుండా 12 వేల ఎకరాల ఆయకట్టును 50,250 ఎకరాలకు పెంచాలని ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. ఆయన చలువ వల్లే గత మూడేళ్లుగా కోయిల్‌సాగర్‌లోకి కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నాయి.

పెరిగిన నీటి మట్టం..
ప్రాజెక్టు నిర్మాణం కన్నా క్రస్టు గేట్ల నిర్మాణానికే రూ.7 లక్షలు అధికంగా  ఖర్చు పెట్టాల్సి వచ్చింది. క్రస్టుగేట్ల నిర్మాణం తర్వాత ప్రాజెక్టులో 33 అడుగుల మేర నీటి మట్టం నిల్వ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆయకట్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి
అవకాశం లభించింది.













ఎత్తిపోతల ద్వారా కోయిల్‌సాగర్‌కు తరలివస్తున్న కృష్ణాజలాలు

Advertisement
Advertisement