ఫార్మాసిటీపై అనుమానాలొద్దు

5 Jun, 2018 01:43 IST|Sakshi

కాలుష్య నివారణకు అన్ని చర్యలు: కేటీఆర్‌

అత్యాధునిక వ్యర్థాల శుద్ధి ప్లాంట్లు  

కాలుష్యకారక పరిశ్రమలు తరలిస్తాం

పరిశ్రమల శాఖ వార్షిక పురోగతి నివేదిక ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ ప్రాంత ప్రజల అనుమానాలు నివృత్తి చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుతో పరిసర ప్రాంతాల్లో జల, వాయు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. వ్యర్థాల శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించగా, పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు.

పరిశ్రమల శాఖ 2017–18లో సాధించిన పురోగతిపై వార్షిక నివేదికను మంత్రి సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌ నుంచి కాలుష్యకారక పరిశ్రమలను ఫార్మాసిటీతో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెలుపలి 19 ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు. ఇప్పటికే మూడు ప్రాంతాలను సిద్ధం చేశామని, మొత్తం పరిశ్రమలు తరలింపును ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు.

పురోగతిలో పారిశ్రామిక రంగం
రాష్ట్రం పారిశ్రామిక రంగంలో శరవేగంగా పురోగమిస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 2017–18లో తెలంగాణ 10.1 శాతం వృద్ధిరేటు సాధించగా, జాతీయ వృద్ధి రేటు 6.6% మాత్రమే అని చెప్పారు. తలసరి ఆదాయం జాతీయ సగటు రూ.1,12,764 కోట్లు ఉండగా, రాష్ట్ర సగటు రూ.1,75,534 అని చెప్పారు.

టీఎస్‌ఐపాస్‌ పారిశ్రామిక విధానం విజయం సాధించిందన్నారు. గనుల శాఖకు గతేడాది రూ.3,500 కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యం కేటాయించగా, రూ.3,700 కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖనిజాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ ఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలతో నాలుగేళ్లలో రూ.1,600 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.  

పెద్ద ఎత్తున పారిశ్రామిక మౌలిక వసతులు
రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి గతేడాది పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో మెగా ఫుడ్‌పార్క్, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజెస్‌ పార్కు, మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్‌ను ప్రారంభించామన్నారు. త్వరలో దండుమల్కాపురం లోని 377 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ప్రారంభిస్తామని, దీనిద్వారా రూ.750 కోట్ల పెట్టుబడులు, 12,250 మందికి ఉద్యోగాలొస్తాయన్నారు.

ఫార్మాసిటీకి సూత్రప్రాయంగా పర్యావరణ అనుమతులు వచ్చాయని, దీనిలో రూ.64 వేల కోట్ల పెట్టుబడులు, 4.20లక్షల మందికి ఉద్యోగాలొస్తాయన్నారు. వరంగల్‌లోని 1,200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా రూ.1,1586 కోట్లు పెట్టుబడులు, 1.13 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయన్నారు.

త్వరలో సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తల పార్కు, బండమైలారంలో సీడ్‌ పార్కు, సంగారెడ్డి జిల్లాలో ఎల్‌ఈడీ పార్కు, సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు, నిజామాబాద్‌లో స్పైస్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లో ఉత్తమ పనితీరు కనబరిచిన పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్‌ పురస్కారాలను అందజేశారు. సీఎస్‌ఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు నేషనల్‌ ప్రొడక్టవిటీ కౌన్సిల్, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌తో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా