సానుకూలతను బట్టి పెట్టుబడులు పెట్టాలి | Sakshi
Sakshi News home page

సానుకూలతను బట్టి పెట్టుబడులు పెట్టాలి

Published Thu, Jun 23 2016 3:02 AM

సానుకూలతను బట్టి పెట్టుబడులు పెట్టాలి

 బ్రిటిష్ హైకమిషనర్‌తో భేటీలో మంత్రి కేటీఆర్

 సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కోసం దేశాన్ని ఓ యూనిట్‌గా చూడకుండా... ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సౌకర్యాలు, విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని బ్రిటీష్ హైకమిషనర్ (ఇండియా) డొమినిక్ యాష్‌క్విత్‌కు మంత్రి కె.తారక రామారావు సూచించారు. వ్యాపారాన్ని సరళం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రస్తుతం తెలంగాణ  అగ్రస్థానంలో ఉందన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్ వంటి వాటిని ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో డొమినిక్ యాష్‌క్విత్ బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేం దుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో స్మార్ట్‌సిటీల నిర్మాణంలో సహకరిస్తామని ఈ సందర్భంగా బ్రిటీష్ హైకమిషనర్ పేర్కొన్నారు. టీఎస్‌ఐపాస్ విధానాన్ని అభినందించారు. టీ-హబ్ ద్వారా పరిశోధనలకు ఊతం లభిస్తుందని చెప్పారు. బ్రిటన్‌లోని స్టార్టప్ ఈకో సిస్టంతో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐటీ, పారిశ్రామిక కార్యక్రమాలు, రూపొందించిన పాలసీలను కేటీఆర్ వివరించారు. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని.. పెట్టుబడి పెట్టే కంపెనీలకు సహకరిస్తున్నామని తెలిపారు. బోయింగ్, టాటా కంపెనీల భాగస్వామ్యంలో హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్వయంగా తాను కృషి చేసినట్లు వివరించారు.

 ఐటీలో టాప్: ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్-4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయన్నారు. త్వరలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్లీన్‌టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని బ్రిటిష్ హైకమిషనర్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. పెట్టుబడులకు అవకాశాలు పెంచేందుకు ఇండో-బ్రిటిష్ బిజి నెస్ కౌన్సిల్‌ను క్రియాశీలం చేస్తామన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై త్వరలో నిర్వహించే ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు హాజ రవాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. బ్రిట న్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టేట్ డెస్క్ ఆలోచనను అభినందించారు. దాంతో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement