ప్రజలతో కేటీఆర్‌ | Sakshi
Sakshi News home page

ప్రజలతో కేటీఆర్‌

Published Tue, Dec 5 2017 2:50 AM

KTR with people - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేవారం నుంచి మునిసిపల్‌ మంత్రి కె. తారక రామారావు జీహెచ్‌ంఎసీ సర్కిల్‌ స్థాయిలో స్థానిక ప్రజలు, రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, ఎన్జీవోలు తదితరులతో ‘టౌన్‌హాల్‌’ సమావేశాల్లో పాల్గొననున్నారు. ‘మన నగరం/ అప్నా షహర్‌’ పేరిట నగరాన్ని మరింతగా తీర్చి దిద్దేందుకు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు, స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యేందుకు ఈ టౌన్‌హాల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానికంగా ఉండే కమ్యూనిటీ హాల్‌ లేదా మరేదైనా హాల్‌లో సర్కిల్‌ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై, సర్కిల్‌ బాగుకు ఏమేం చేయాలో వారి నుంచి తెలుసుకుంటారు.

వచ్చే వారం నుంచి సర్కిల్‌ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అన్ని విభాగాల అధికారులు కూడా సమావేశాల్లో ఉంటారు కనుక అప్పటికప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఒక జోన్‌లోని ఒక సర్కిల్‌ నుంచి ప్రారంభించే ఈ టౌన్‌హాల్‌ సమావేశాలు మరుసటి వారం మరో జోన్‌లో నిర్వహిస్తారు. అలా అన్ని జోన్లు పూర్తయ్యాక మొదటి జోన్‌లోని మరో సర్కిల్‌లో నిర్వహిస్తారు. ఇలా గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు వెరసి 30 వారాల పాటు జరగనున్న ఈ సమావేశాలు వారంలో ఏ రోజు నిర్వహించేది ఇతరత్రా వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. 

Advertisement
Advertisement