‘ఏక్‌ దిన్‌ కా రాణి’కి ఆపన్న హస్తం | Sakshi
Sakshi News home page

‘ఏక్‌ దిన్‌ కా రాణి’కి ఆపన్న హస్తం

Published Mon, Dec 11 2017 3:07 AM

ktr reacted on sakshi's story - Sakshi

సిరిసిల్లరూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన జెలిపెటి నర్సవ్వ(70), ఆమె తమ్ముడు జములయ్య దుర్భర జీవనంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. చుట్టూ మురికికూపం.. మధ్యలో డేరా కింద అంధురాలైన నర్సవ్వ, ఆమెకు తోడుగా ఉంటున్న తమ్ముడి వ్యథపై ‘సాక్షి’మెయిన్‌లో ఆదివారం ‘ఏక్‌ దిన్‌ కా రాణి’శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మంత్రి కె. తారకరామారావు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు.

తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో తంగళ్లపల్లి తహసీల్దార్‌ అంజన్న నర్సవ్వ వద్దకు వెళ్లారు. ఆమె వివరాలు సేకరించారు. అంత్యోదయ కార్డుపై ఆమె వేలిముద్రలు సరిపోవడంలేదని గుర్తించి మ్యానువల్‌గా సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పింఛన్‌ మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

గుడిసె స్థానంలో రెండు నెలల్లో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఆదర్శయూత్‌ క్లబ్‌ సభ్యులు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన ఎగుమామిడి విజయేందర్‌రెడ్డి తాను ప్రతినెలా రూ.500 విలువైన నిత్యావసర సరుకులు అందజేస్తామని ప్రకటించారు. జిల్లెల్లకు చెందిన నారేన్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సైతం ఇల్లు నిర్మాణానికి ఆర్థికసాయం అందిస్తామని చెప్పారు. ‘సాక్షి’కథనం ద్వారా నర్సవ్వ సమస్యకు పరిష్కారం లభించడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.

(చదవండి : ఏక్‌ దిన్‌ కా రాణి.. ఈ నర్సవ్వ )

Advertisement
Advertisement