పట్టణాలపై పూర్తి ఆధిపత్యం! | Sakshi
Sakshi News home page

పట్టణాలపై పూర్తి ఆధిపత్యం!

Published Sat, Jul 27 2019 1:48 AM

KTR TRS Party Review Meeting In Telangana Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించేలా నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీపై పూర్తి ఆధిక్యాన్ని చాటేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన 4ఎంపీ సీట్ల పరిధిలో పార్టీ సభ్యత్వాన్ని భారీగా నమోదు చేసి రాజకీయంగా బలపడేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల సభ్యత్వ ఇన్‌చార్జీలను ఆదేశించారు. కార్పొరేషన్‌ ఎన్నికలు జరగాల్సిన హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో ఇప్పటి నుంచే పోలింగ్‌ బూత్‌ స్థాయి నుంచి పార్టీని, కేడర్‌ను పటిష్టం చేసుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ సీట్లు గెలిచిన చోట ఎక్కడా కూడా టీఆర్‌ఎస్‌ బలం, ఓట్లు తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఎదురైన ఓటములను అధిగమించేలా మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా 60 లక్షల సభ్యత్వాల నమోదు పూర్తిచేయాలని, పట్టణాల్లో బూత్‌కమిటీల నియామకం చేపట్టాలని సూచించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ సభ్యత్వ ఇన్‌చార్జీలు, సభ్యత్వ డిజిటలైజేషన్‌ ఇన్‌చార్జీలతో సమీక్ష సందర్భంగా ఆయా అంశా లు చర్చకు వచ్చాయి. 

చురుగ్గా సభ్యత్వ నమోదు 
ఇప్పటికే 50 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, ఇంకా సభ్యత్వ నమోదు చురుగ్గా కొనసాగుతోందని సమీక్షలో కేటీఆర్‌ పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల మంది వివరాలను పార్టీ డిజిటలైజేషన్‌ పూర్తి చేసిందని చెప్పారు. పలు నియోజక వర్గాల్లో లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు జరిగిందని, ఇలాంటి చోట్ల మరిన్ని సభ్యత్వ నమోదు పుస్తకాలను పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారని తెలియజేశారు. సభ్యత్వ నమోదు సందర్భంగా కార్యకర్తల పూర్తి వివరాలను సేకరించాలని ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కనీస వివరాలను అందిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాల అధారంగానే కార్యకర్తల బీమా సౌకర్యం ముడిపడుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. లక్ష్యం మేరకు సభ్యత్వాన్ని పూర్తి చేసిన పార్టీ ఇన్‌చార్జీలను, స్థానిక ఎమ్మెల్యేలను అభినందించారు. 

గజ్వేల్, పాలకుర్తి టాప్‌: పల్లా 
టీఆర్‌ఎస్‌లో చేరిన సభ్యులందరికి రూ.2లక్షల చొప్పున ప్రమాదబీమా ఆగస్టు1 నుంచే అమల్లోకి వచ్చేలా కేటీఆర్‌ ఆదేశించారని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో బూత్‌ కమిటీల నియామకం పూర్తి చేయాలని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయన్నారు. పార్టీ సభ్య త్వం తీసుకున్న వారికి శిక్షణాకార్యక్రమాలు నిర్వహించి క్రమశిక్షణతో పాటు పరిజ్ఞానం, మేధోపరంగా సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుతామన్నారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్, పీఆర్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నియోజకవర్గం పాలకుర్తిలలో అత్యధికంగా 70 వేలకు మించి సభ్య త్వ నమోదు జరిగిందన్నారు. 50వేల చొప్పున సభ్యత్వం దాటిన నియోజకవర్గాలు 20కి పైగానే ఉన్నాయన్నారు.

Advertisement
Advertisement