నిధులున్నా.. | Sakshi
Sakshi News home page

నిధులున్నా..

Published Sun, Oct 12 2014 3:36 AM

Lakhs of Government funding over the years, bulging

 నీలగిరి : ప్రభుత్వశాఖలకు చెందిన లక్షల రూపాయల నిధులు కొన్నేళ్లుగా జెడ్పీలో మూలుగుతున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా పరిషత్‌కు సంక్రమించిన అధికారాలను అమలుచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సమైక్యరాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలనాకాలంలో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరైన నిధులు నేటి వరకూ నిరుపయోగంగానే ఉన్నాయి. మత్స్య కార్మికుల సంక్షేమానికి మంజూరైన రూ.90 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో పశు వైద్యశాలలు, ప్రహరీల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన రూ.70 లక్షలు ఖర్చు పెట్టకుండా జెడ్పీ ఖాతాలోనే నిల్వ ఉంచుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత కొలువుదీరిన జెడ్పీ పాలకవర్గం ఇటీవల నిర్వహిస్తున్న వరుస సమీక్ష సమావేశాల్లో ఈ నిధులు సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ నిధులు ఏం చేయాలో...వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి అధికారుల్లో నెలకొంది.
 
 నిలిచిన పథకాల అమలు..
 నిధులు నిలిచిపోవడంతో మత్స్యశాఖ అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరానికి అప్పటి ప్రభుత్వం జెడ్పీకి రూ.90 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బెస్తలకు రాయితీలు ద్వారా వలలు, తట్టలు కొనుగోలు చేసి ఇవ్వడం, ఎస్సీలకు చేప ల వ్యాపారం నిమిత్తం దుకాణాలు ఏర్పాటు చేసుకునేం దుకు కేటాయించారు. దీంట్లో వలలు, తట్టలు టెండర్లు ద్వారా కొనుగోలు చేయాలి. అదేవిధంగా చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు చేప పిల్లలను పంపిణీ చేసేం దుకు ఈ నిధులు ఖర్చు పెట్టాలి. కానీ జిల్లాపరిషత్ నిధు లు విడుదల చేయకపోవడంతో ఈ పథకాల అమలు రెండేళ్లుగా నిలిచిపోయాయి. జెడ్పీ నిర్వహిస్తున్న వరుస సమీక్ష సమావేశాల పుణ్యమాని ఇటీవల రూ.40 లక్షలు మత్స్యశాఖకు విడుదల చేశారు. ఇంకా రూ.50 లక్షలు జెడ్పీ వద్దనే ఉన్నాయి. అయితే విడుదల చేసిన రూ.40 లక్షలకు సంబంధించిన కార్యాచరణ కూడా ఇంకా పూర్తికాలేదు. వలలు, తట్టలు కొనేందుకు టెండర్లు పిలిచారని అధికారులు చెబున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన రూ.50 లక్షలు కూడా విడుద ల చేయాలని కోరుతూ మత్య్యశాఖ అధికారులు జెడ్పీకి లేఖ రాశారు. కానీ మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టిన తర్వాతే రూ.50 లక్షలు విడుదల చేస్తామని జెడ్పీ అధికారులు మెలిక పెట్టారు. దీంతో పథకాల అమలు ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
 
 పశుసంవర్థక శాఖ నిధులపై అయోమయం..
 గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యశాలల నిర్మాణం, ప్రహరీలు, వైద్యశాలల మరమ్మతుల నిమిత్తం 2010 నుంచి 2013-14 సంవత్సరం వరకు జిల్లా పరిషత్‌కు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులు ఇప్పటి వరకు ఖర్చుపెట్టలేదు. మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టే అధికారం జెడ్పీకి ఉన్నా...పనులకు సంబంధించిన అనుమతులు రా్రష్టస్థాయి అధికారుల నుంచే రావాల్సి ఉంటుంది. దీంతో పైనుంచి పనుల అనుమతులు రాలేదని కారణంతో ఆ నిధులు ఖర్చుపెట్టకుండా జెడ్పీ ఖాతాలోనే ఉంచారు. కనీసం ఆ పనుల అనుమతులకు సంబంధించి అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నిధులు మంజూరైనా వృథాగానే ఉంచాల్సి వచ్చింది. అయితే రాష్ర్టం విడిపోయే ముందు ప్రభుత్వ శాఖల్లోని నిధులను తిప్పి పంపాలని గవర్నర్ ఆదేశాలు జారీచేసినప్పటికీ, వాటిని వెనక్కి పంపకుండా ఇక్కడే ఉంచారు. ప్రభుత్వానికి మాత్రం జీరోబ్యాలెన్స్ చూపుతూ లెక్కలు పంపించారు. దీంతో ప్రస్తుతం ఈ నిధులను ఖర్చు పెట్టాలంటే మళ్లీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్తగా అనుమతులు వస్తే తప్ప.. ఖర్చు పెట్టే అవకాశం లేకుండా పోయింది. నిధుల్లేక ప్రభుత్వ శాఖలు నీరసిస్తుంటే...నిధులున్నా వినియోగించుకోలేని స్థితిలో అధికారులు పనిచేయడం విచారకరం.
 

Advertisement
Advertisement