భూముల లెక్క తేలుద్దాం! | Sakshi
Sakshi News home page

భూముల లెక్క తేలుద్దాం!

Published Fri, Jul 21 2017 1:30 AM

భూముల లెక్క తేలుద్దాం!

రాష్ట్రంలో అన్ని భూముల పూర్తి వివరాల నమోదుకు సర్కారు నిర్ణయం
సమగ్ర కుటుంబ సర్వే తరహాలో భారీ సర్వేకు కసరత్తు
వేలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో మూడు రోజుల పాటు నిర్వహణ
ఆగస్టు చివరి వారంలో సర్వే చేపట్టాలని సీఎం యోచన  


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని భూము ల వివరాలను పక్కాగా రికార్డు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ తరహా భూములు, వాటి విస్తీర్ణం, యజమానులు తదితర అన్ని అంశాలనూ నమోదు చేయనుంది. ఇందుకోసం సమగ్ర కుటుంబ సర్వే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా మరో భారీ సర్వేకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే 3 రోజుల పాటు రాష్ట్రమంతటా సమగ్ర భూముల సర్వే చేయిం చాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. పల్లెల నుంచి పట్నం వరకు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది, ఎవరెవరి పేరట ఉంది, విస్తీర్ణం ఎంత, సాగు భూములెన్ని, హక్కుదా రులెవరు.. ఇలా ప్రతి అంగుళం భూమి వివరాలన్నీ సేకరించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సర్వే నిర్వహించనున్నారు.

ఇక వివాదాలకు చెక్‌..
ఈ సర్వే సందర్భంగా భూముల వివాదాలను పరిష్కరించి.. వాస్తవ యజమానులెవరో  గుర్తించి, ప్రకటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే సీఎం ఇప్పటికే ఈ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం కావడంతో ఆగస్టు 15 వరకు హరితహారం కార్యక్రమంపై దృష్టి సారించాలని... ఆ నెల చివరి వారంలో భూముల సమ గ్ర సర్వే చేపట్టాలని అధికారులకు సూచించారు. సర్వే నిర్వహణకు ఉద్యోగులు సరిపోకపోతే.. 15 వేల మంది వరకు నిరుద్యోగ యువకులను వినియోగించుకోవాలని ఆదేశించారు.

పెట్టుబడి పథకానికి  ముందస్తు వ్యూహం!
వచ్చే ఏడాది నుంచి వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దాదాపు రూ.11 వేల కోట్ల భారీ వ్యయంతో కూడిన పథకం కావటంతో.. అవకతవకలకు తావు లేకుండా, పక్కాగా అమలు చేసేందుకు సర్కారు ముందస్తు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సాగు భూముల సర్వే చేయించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ సర్వేలో దాదాపు 1.26 కోట్ల ఎకరాల సాగు భూములున్నట్లు తేలింది. అయితే తమ భూముల వివరాలు ఇంకా నమోదు కాలేదని, మరో అవకాశం ఇవ్వాలంటూ రైతుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. అంతేగాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉండడం వంటి కారణాలతో మరో 12 శాతం భూముల వివరాల నమోదు పెండింగ్‌లో పడింది. ఈ నేపథ్యంలోనే సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం మొగ్గు చూపింది.

యూనిక్‌ కోడ్‌తో టైటిల్‌ డీడ్‌
భూమి లెక్కలు తేలిన తర్వాత కొత్తగా టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాస్‌ పుస్తకాలు ఇస్తారు. ప్రతి రైతుకు, పాస్‌ పుస్తకానికి ప్రత్యేక (యూనిక్‌) కోడ్‌ ఇస్తారు. భూరికార్డులన్నీ సరిచేసిన తర్వాత రూపొందించిన జాబితానే ప్రభుత్వం అనుసరిస్తుంది. అందులోని వివరాల ఆధారంగా.. ఏ రైతు వద్ద ఎంత భూమి ఉందనే దాని ప్రకారం పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తుంది. ఇక రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాలు, వారసత్వ బదిలీ, పేరు మార్పిడి విధానాలన్నీ అక్టోబర్‌ నెలాఖరులోగా సరళంగా, పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనున్నారు. మ్యుటేషన్, పాస్‌ పుస్తకాల జారీ వంటివి నిర్ధారిత సమయంలోగా చేయకుంటే సంబంధిత అధికారికి జరిమానా విధించేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు.

రెవెన్యూ రికార్డుల సవరణ.. ప్రచురణ
నిజాం కాలంలో అమల్లోకి వచ్చిన రెవెన్యూ విలేజ్‌ విధానంలో నిర్ణయించిన గ్రామ శివార్లు, అప్పటి సర్వే నంబర్లే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం రెవె న్యూ శాఖ వద్ద, వ్యవసాయాధికారుల వద్ద భూమి రికార్డులున్నాయి. అవి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కాకపోవటంతో భూవివాదాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే ద్వారా వివాదాలను పరిష్కరించనున్నారు. మొత్తం వ్యవసాయ భూముల రికార్డులన్నీ సర్వే వివరాలతో సరి పోల్చి, అవసరమైన సవరణలు చేస్తారు.

అనంతరం ఆయా గ్రామాల వారీగా భూముల వివరాలు, వాటి యజమానులు, సర్వే నంబర్లు, సర్వే సందర్భంగా సవరించిన రికార్డుల వివరాలన్నీ ఓటర్ల జాబితాల తరహాలో అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి, విచారణ జరుపుతారు. అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులతో భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఈ తుది భూముల రికార్డుల్లోనూ ఏవైనా అభ్యంతరాలుంటే.. పరిశీలించి, సరిదిద్దుతారు.

Advertisement
Advertisement