పేదల దరిచేరని చట్టాలు | Sakshi
Sakshi News home page

పేదల దరిచేరని చట్టాలు

Published Sun, Mar 29 2015 1:25 AM

పేదల దరిచేరని చట్టాలు

* న్యాయ సహాయం అందక నష్టపోతున్న పేదలు, గిరిజనులు
* పారాలీగల్ వ్యవస్థతో చట్టాలపై సామాన్యులకూ అవగాహన
* సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్.దవే      

 
సాక్షి, హైదరాబాద్: భూములకు సంబంధించిన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం వలన గ్రామీణ పేదలు, గిరిజనులు ఎంతో నష్టపోతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ ఆర్. దవే అన్నారు. శనివారం ‘భూ సమస్యలు-సహాయ సంస్థలు’ అంశంపై నల్సార్ యూనివర్సిటీ, లాండెసా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ దావే మాట్లాడుతూ.. భూ వివాదాలకు సంబంధించి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్న పేదవర్గాలకు న్యాయ సహాయం అందించడంలో పారాలీగల్స్ పాత్ర ఎంతో కీలకమైనదని చెప్పారు. ఇందుకు సంబంధించిన చట్టాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.
 
 పేదల ముంగిటకు న్యాయవ్యవస్థ
 న్యాయ వ్యవస్థను పేదల ముంగిటకు తీసుకెళ్లేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన మొబైల్ ఏడీఆర్ (ఆల్టర్‌నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్)వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు తమదృష్టికి వచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్త అన్నారు. రాజీ కుదర్చడం ద్వారా ఎన్నో భూవివాదాలను పరిష్కరించవచ్చన్నారు. తుది తీర్పు కోసం కాకుండా న్యాయం, ధర్మం కోసం పనిచేయాలని న్యాయవాదులకు, పారాలీగల్స్‌కు సూచించారు. నల్సార్ యూనివర్సిటీ ఉపకులపతి ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రెండు శాతం, పట్టణ ప్రాంతాల్లో 28 శాతం భూవివాదాలు ఉన్నాయన్నారు. దేశంలో 12 శాతం హత్యలు భూ వివాదాలకు సంబంధించినవేనన్నారు.
 
 జీడీపీలో 1.3శాతం నష్టం భూ వివాదాల వల్లనే జరుగుతోందని వివరించారు. ప్రతీ గ్రామంలోనూ కనీసం 100 నుంచి 200 వరకు భూ వివాదాలు ఉన్నాయని, సరైన న్యాయ సహాయం అందక 50శాతం మంది యజమానులు అభద్రతకు గురవుతున్నారని చెప్పారు. చట్టాలు, న్యాయ వ్యవస్థపై సరైన అవగాహన లేకపోవడం, న్యాయవాదుల మద్దతు, ఉచిత న్యా య సహాయం అందకపోవడంతో పాటు అధికారుల సహాయ నిరాకరణ వలన భూ వివాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా రెవెన్యూ అధికారులకు చట్టాలపై అవగాహన కోసం సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
 
 పేదలకు అండగా ‘ల్యాండెసా’..
 ‘ల్యాండెసా’ జాతీయ డెరైక్టర్ సంజయ్ పట్నాయక్ మాట్లాడుతూ.. భూ వివాదాల పరిష్కారంలో పేదలకు న్యాయ సహాయం అందించేందుకు ల్యాండెసా తనవంతు కృషి చేస్తోందన్నారు. స్టేట్ డెరైక్టర్ సునీల్ మాట్లాడుతూ.. భూమికి సంబంధించి పేదలకు, గిరిజనులకు హక్కులు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. సదస్సుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి పారాలీగల్ వాలంటీర్లు, న్యాయ నిపుణులు  హాజరయ్యారు. వివిధ అంశాలపై జరిగిన చర్చల్లో గిరిజన కార్పొరేషన్ మాజీ డెరైక్టర్ వీఎన్‌వీకే శాస్త్రి, మాజీ ఐఏఎస్ అధికారి టి.గోపాలరావు, ల్యాండెసా కర్ణాటక స్టేట్‌డెరైక్టర్ లోకేశ్, ఒడిశా అదనపు జిల్లా జడ్జి సుబేంద్ర మహంతి, నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement