‘ఉపకార’మేదీ.? | Sakshi
Sakshi News home page

‘ఉపకార’మేదీ.?

Published Sun, May 11 2014 2:28 AM

‘ఉపకార’మేదీ.? - Sakshi

 పేద విద్యార్థులకు ఆసరా ఇస్తున్న ఉపకార వేతనాలు విద్యాసంవత్సరం ముగింపునకు చేరుకుంటున్నా అందక పోవడం విమర్శలకు గురవుతోంది. ఆఖరికి అప్పులు చేసి చెల్లించుకోవాల్సిన దుస్థితి పిల్లలకు ఏర్పడింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాల వారికి ఇది భారంగా మారింది. సకాలంలో అధికారులు స్పందించని కారణంగా వచ్చిన నిధులు వెనక్కి మళ్లాయి.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూ రం కాకుండా వారికవసరమైన ఉపకారవేతనం, బోధన రుసుం అందిస్తామనే పాలకుల మాటలు ఆచరణకు నోచుకోవడంలేదు. విద్యాసంవత్సరం ముగిసినా జిల్లాలో 17,615 మంది విద్యార్థులకు అ వి అందకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు సకాలంలో నిధులను విడుదల చేయకపోవడమే దీని కి కారణం. గత నెలాఖరులో ఎట్టకేలకు నిధులను విడుదల చేసినా ట్రెజరీలో వాటిపై ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించడంతో మంజూరు ఆగిపోయింది.

ఫలితంగా రూ.16.09 కోట్లు మంజూరు కాకుండానే వెనక్కి మళ్లాయి. దీంతో విద్యార్థులు అప్పులుచేసి మరీ ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల్లో కలిపి మొత్తం.. మంది విద్యార్థులు 2013-14 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో ఉపకార వేతనాలు, బోధన రుసుంలకు దరఖాస్తు చేసుకున్నారు. వారికి రూ.56.09 అవసరం కాగా అందులో రూ. 40కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో అధికారులు వాటిని విద్యార్థులకు అందజేశారు. మరో 17,615 మందికి రూ.16.09 కోట్లు అవసరం కాగా ప్రభుత్వం వాటిని సకాలంలో విడుదల చేయలేదు. చివరకు మార్చి నెలాఖరులో విడుదల చేసినా ట్రెజరీపై ఆంక్షల నేపథ్యంలో అవి మంజూరుకాక వెనక్కిమళ్లాయి.  సాంకేతిక, ఇతర కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించే కొందరు విద్యార్థులు హాల్‌టికెట్‌లను పొందేందుకు అప్పుచేసి ఫీజులు కట్టాల్సిన దుస్థితి నెలకొంది.
 
 ఇబ్బందులు అనేకం..
 జిల్లాలో 17,615 మందికి ఉపకార వేతనాలు రాకపోవడానికి నిధుల విడుదల జరగకపోవడం ఓ కారణమైతే ఆధార్‌కార్డులు లేకపోవడం, బ్యాంక్ ఖాతాలు తప్పుగా ఇవ్వడం, ఈ ఏడాది కొత్తగా అమలుచేసిన బయోమెట్రిక్ విధానం కూడా ఇబ్బందిగా మారింది. కళాశాలల యాజమాన్యాలు బయోమెట్రిక్ పరికరాల కొనుగోలులో తీవ్ర జాప్యం చేయడం విద్యార్థులపై ప్రభావాన్ని చూపింది. విద్యార్థుల వేలిముద్రలు స్కానర్లతో సరిపోల్చాకే ప్రిన్సిపాళ్లు సంక్షేమాధికారులకు ఆన్‌లైన్‌లో నివేదిస్తారు. ఈ ప్రక్రియ ఆలస్యం కాగా హార్డ్ కాపీలను అందజేయని ఫలితంగా చాలామంది విద్యార్థుల దరఖాస్తులు ఇంకా కళాశాల స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని దరఖాస్తులు అధికారులకు చేరినా.. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉండటం కూడా ఉపకార వేతనాల మంజూరులో ఆలస్యమైంది.
 
 హార్డ్ కాపీలను అందిస్తే మంజూరు
 నిధులపై ఫ్రీజింగ్ ఉండటం, ప్రిన్సిపాళ్లు హార్డ్ కాపీలను సకాలంలో అందించని కారణంగానే ఉపకారవేతనాల మంజూ రులో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఫ్రీ జింగ్ ఎత్తివేయడంతో నిధులు సిద్ధంగా ఉన్నందున కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి వాటి హార్డ్‌కాపీలను అందజేస్తే వాటిని తక్షణమే మంజూరుచేస్తాం. - జయప్రకాష్,
 సాంఘీక సంక్షేమ శాఖ డీడీ

Advertisement

తప్పక చదవండి

Advertisement