రెండేళ్లలో ఎల్‌ఈడీ కాంతులు  | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ఎల్‌ఈడీ కాంతులు 

Published Sat, Oct 14 2017 2:01 AM

LED lights in two years

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఎంపిక చేసిన 60 మంది సర్పంచ్‌లకు ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జూపల్లి పాల్గొన్నారు. 2019 మార్చి 31 నాటికి ప్రతి గ్రామానికి ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేసే లక్ష్యంతో 60 గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతున్నామన్నారు. ఇందుకోసం కేంద్ర ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఈఎఫ్‌ఎస్‌ఎల్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.

ఈ బల్బులు అమర్చడం వల్ల గ్రామ పంచాయతీలపై ఎలాంటి ఆర్థిక భారం పడదని, పెట్టుబడి లేకుండా పంచాయతీలు విద్యుత్‌ ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. థర్డ్‌ వైర్‌ సౌకర్యం ఉన్న పంచాయతీలు ముందుకు వస్తే ఈఎఫ్‌ఎస్‌ఎల్‌.. ఆయా గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తుందన్నారు. పంచాయతీలు సొంతంగా లేదా విద్యుత్‌ శాఖ ద్వారా లేదా 14వ ఫైనాన్స్‌ నిధుల నుంచి థర్డ్‌ వైర్‌ సౌకర్యం కల్పించుకోవచ్చన్నారు.  

72 గంటల్లో పునరుద్ధరణ 
బల్బుల పనితీరును ఆన్‌లైన్‌ ద్వారా ఈఎఫ్‌ఎస్‌ఎల్‌ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారని తెలిపారు. వెలగని బల్బులను 72 గంటల్లో తిరిగి పునరుద్ధరిస్తారని, అలా పునరుద్ధరించకుంటే.. రోజుకి బల్బుకి రూ.5 చొప్పున పంచాయతీకి కంపెనీ చెల్లిస్తుందన్నారు. గ్రామ పంచాయతీలు సంస్థతో 5, 7, 10 ఏళ్లు ఒప్పందం కుదుర్చుకోవచ్చని తెలిపారు. ఒప్పందాన్ని బట్టి ఆదా అయిన డబ్బులో 80 శాతం సంస్థకు, 20 శాతం పంచాయతీకి దక్కుతుందన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటికే  ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశామని చెప్పారు.  రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు ఉపయోగించుకోవాలన్నారు.

Advertisement
Advertisement