రుణమాఫీ కోసం ఆస్తుల తనఖా! | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కోసం ఆస్తుల తనఖా!

Published Thu, Sep 18 2014 1:19 AM

రుణమాఫీ కోసం ఆస్తుల తనఖా! - Sakshi

  • పథకం అమలుపై పలు అంశాలను పరిశీలిస్తున్న టీ సర్కారు
  •   ‘రుణ మాఫీ’పై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
  •   నిధుల సమీకరణ కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల గుర్తింపు
  •   రైతులకు నేరుగా లేదా ఎస్‌పీవీ ఏర్పాటు చేసి బాండ్ల జారీ
  •   అన్ని అంశాలను పరిశీలించి 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
  •   నెలాఖరు నుంచి రైతులందరికీ కొత్త రుణాలు
  •   ఏడు శాతం వడ్డీపై తీసుకున్నవన్నీ వ్యవసాయ రుణాలే
  •   వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడి
  •  
     సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణాల మాఫీ కోసం తెలంగాణ సర్కారు ఆస్తులను తనఖా పెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. రైతులకు నేరుగా లేదా ఒక ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేసి బాండ్లు జారీ చేయాలని భావిస్తోంది. రుణమాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి, ఈ నెలాఖరులోగా ఆ రైతులకు కొత్తరుణాలు ఇప్పించే దిశగా ప్రయత్నం చేస్తోంది.. ఈ అంశాలన్నింటినీ పరిశీలించేందుకు ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి, మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ నెల 20వలోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉప సంఘాన్ని కోరింది. రుణమాఫీపై గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలుచేయడంపై 30వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఇందుకు నాలుగు అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాజీవ్‌శర్మ ఉప సంఘానికి సూచించారు. 
     
     బ్యాంకులకు 50% నిధులు..
     రుణమాఫీ మొత్తంలో సగం నిధులను బ్యాంకులకు జమచేయాలని, మిగతా 50 శాతం నిధులను రైతులకు బాండ్లుగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాసింది. ఈ ప్రతిపాదనపై బ్యాంకర్ల కమిటీ చర్చిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అవసరమైతే ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెట్టి మాఫీ నిధులను సమీకరించుకోవాలని అందులో చెప్పినట్లు తెలుస్తోంది.
     
     అవి వ్యవసాయ రుణాలే..
     బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీతో రైతులు తీసుకున్న రుణాలన్నీ వ్యవసాయ రుణాలుగానే పరిగణిస్తామని, అటువంటి వాటికి మాఫీ వర్తిస్తుందని మంత్రి వెల్లడించారు. రుణాల రీషెడ్యూలుకు ఆర్‌బీఐ నిబంధనలు అడ్డంకయ్యాయన్నారు. రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో రూ. 4,500 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం కోరగా..షరతులతో వంద మండలాల్లో రూ.1,000 కోట్లు మాత్రమే రీషెడ్యూల్ చే సేందుకు రిజర్వుబ్యాంకు అంగీకరించినట్లు చెప్పారు.
     
     రైతులకు ఇజ్రాయెల్ సాంకేతికత
     తెలంగాణలో వర్షాభావం వలన పంట దిగుబడి కోల్పోతున్న రైతులకు ఇజ్రాయెల్ దేశం అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నామని మంత్రి పోచారం తెలిపారు. ఇజ్రాయెల్ సహకార మంత్రి యెహల్ విలన్ ఆహ్వానం మేరకు మంత్రులు, అధికారుల బృందం ఆ దేశం వెళ్లేందుకు సీఎం అంగీకరించారన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధిస్తున్న ఇజ్రాయెల్ ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మంత్రి యెహల్ విలన్ మాట్లాడుతూ... తెలంగాణకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 
     
     సీఎస్ చేసిన సూచనలు
     రుణమాఫీకి ఏవిధంగా నిధులు సమకూర్చాలి? తద్వారా అర్హులైన రైతులకు గత సంవత్సరం తీసుకున్న రుణ మొత్తం ఈసారి కూడా లభించేలా ప్రతిపాదనలు
     
     రుణ మాఫీకి ఎలా సాయం అందించాలన్న అంశంతో పాటు.. రైతులకు నేరుగా లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా బాండ్లు, పనిముట్లు ఇవ్వడానికి అనుసరించే విధానం
     
     రుణ మాఫీకి అవసరమైన నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను గుర్తించడం
     
     ఇతర ఆస్తులను ఎస్‌పీవీకి బదలాయించడంతో పాటు అందుబాటులో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టే అంశాన్ని పరిశీలించడం  
     
     మూడు రోజుల్లో నివేదిక..
     రుణమాఫీపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం వెంటనే సమావేశమై చర్చించింది. అనంతరం కమిటీ అధ్యక్షుడు, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మాఫీ చేయాల్సిన వ్యవసాయ రుణాల మొత్తం సుమారు రూ. 17 వేల కోట్లని పేర్కొన్నారు. రుణ మాఫీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, రైతులందరికీ నెలఖారు నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని సీఎం కేసీఆర్ తపన పడుతున్నారని చెప్పారు. 34 లక్షల మంది రైతుల రుణ ఖాతాలకు సంబంధించి బ్యాంకులనుంచి తమకు సమాచారం వచ్చిందన్నారు. ఉప సంఘం మరోమారు చర్చించి మూడు రోజుల్లో  నివేదిక ఇవ్వనుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement