చక్రాపూర్‌లో చిరుత కలకలం | Sakshi
Sakshi News home page

చక్రాపూర్‌లో చిరుత కలకలం

Published Sun, Apr 1 2018 7:39 AM

Leopard Wandering At Chakrapur Forest Area - Sakshi

మూసాపేట (దేవరకద్ర) : మండలంలోని చక్రాపూర్‌ గ్రామంలో చిరుత పులి వరుస దాడులతో కలకలం సృష్టిస్తోంది. గ్రామ శివారులోని అడవిలో గత కొన్ని నెలల నుంచి చిరుత పులి సంచరి స్తూ.. మూగజీవాలపై దాడి చేస్తుండటంతో ప్రజలు, రైతులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెలలుగా వరుస దాడులు చేస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఫలితంగా రైతులు సాగు చేసిన పంటలకు కాపలా వెళ్లి అడవి జంతువుల బారి నుంచి కాపాడుకోలేక.. మరో పక్క చేసిన అప్పులను తీర్చలేక లబోదిబోమంటున్నారు. ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలానికి వెళ్లడానికే జంకుతున్నారు. 

అడవులకు అతి సమీపంలో.. 
చిరుతపులి గడిచిన నాలుగు నెలల్లో 6 మేకలు, రెండు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. చక్రాపూర్‌ గ్రామానికి, సమీపంలోని తండాలకు అడవులు దగ్గరగా ఉండటంతో తరచూ చిరుత సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన హరిజన్‌ కుర్మయ్య, మాసన్న, కావలి తిరుమలయ్యకు చెందిన మేకలను చంపి ఎత్తుకెళ్లగా.. తిరుమలి ఎర్రన్నకు చెందిన లేగ దూడను కూడా చంపడం కలకలం రేపుతోంది.

ఇన్ని రోజుల నుంచి అడవిలో పందులు, ఎలుగుబంట్లు, నక్కల సంచారం ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు చిరుత సంచారంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం ఎక్కువైందని వాపోయారు. గ్రామస్తులకు జీవనాధారంగా ఉన్న వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా కూడా జంకుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఇప్పటికే రాత్రివేళల్లో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు స్పందించి చిరుత పులిని బంధించి తీసుకెళ్లాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

నీటి కోసం వచ్చింది
చిరుత పులులు ఎప్పుడూ అడవిలోనే తిరుగుతాయి. ప్రస్తుతం ఈ అడవిలో ఒకే ఒక్క చిరుత ఉంది. దానికి తాగునీరు దొరకక.. గ్రామ సమీపంలోకి వచ్చి పశువులపై దాడి చేసి ఉంటుంది. చుట్టుపక్కల పొలాల దగ్గర ఉన్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి «æదాహం వేసినప్పుడు ఎవరి మీదైనా దాడి చేస్తాయి. అడవిలో చిరుత కోసం తొట్లు ఏర్పా టు చేసి నీళ్లు పోస్తున్నాం. మేకపోతు చిరుత దాడిలో మృతిచెందింది. కాబట్టి నష్టపరిహారం చెల్లించేలా చూస్తాను. 
– నరేందర్, బీట్‌ ఆఫీసర్, మూసాపేట

మమ్మల్ని పట్టించుకోరా? 
ప్రతినిత్యం మూగజీవాలైన పశువులు, మేకలు, గొర్రెలను కాపరులు గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్తున్నా కూడా వాటికి సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేకపోతున్నారు. అడవిలో ఉన్న వనరులతో కనీస అవసరాలైన కట్టెలు, రాళ్లు, ఇసుక ఇలా ఏదో ఒకటి గ్రామానికి తీసుకువచ్చిన కూడా అటవీ శాఖాధికారులు మాత్రం వారిపై కేసులు నమోదు చేస్తున్నారే తప్ప ఇలా అటవీ జంతువులు మూగజీవాలపై దాడులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అడవిలో సిమెంట్‌ రింగులు ఏర్పాటు చేసి ట్రాక్టర్ల ద్వారా నీళ్లు పోయడం ఎంత వరకు సబబని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

1/1

అడవిలో ఏర్పాటు చేసిన  తొట్లలో నీళ్లు పోస్తున్న కూలీలు  

Advertisement

తప్పక చదవండి

Advertisement