అనుమతులున్న వాటి కే రిజిస్ట్రేషన్లు | Sakshi
Sakshi News home page

అనుమతులున్న వాటి కే రిజిస్ట్రేషన్లు

Published Wed, Jan 20 2016 3:25 AM

అనుమతులున్న వాటి కే రిజిస్ట్రేషన్లు

లేఅవుట్లపై ప్రభుత్వానికి
సిఫార్సు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ
►  తమిళనాడు తరహా విధానం
అమలుకు సర్కారు యోచన

 సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో అక్రమాలను నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల అనుమతి లేని లేఅవుట్లకు ఇక నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల చట్టానికి తెచ్చిన సవరణలను పరిశీలించి, అందులోని ఆమోదయోగ్యమైన అంశాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించింది.
 
  లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ల చట్టంలో కొత్తగా సవరణలు తేవడం కంటే, పురపాలక చట్టంలో సవరణలు చేయడం మేలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఇటీవల ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ అభిప్రాయాలను పేర్కొన్నారు. గతంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ పట్టాదారు పాస్‌బుక్, టైటిల్ డీడ్ లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) యాక్ట్‌లో అప్పటి ప్రభుత్వం కొన్ని సవరణలు చేసిన అంశాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు లేఖలో ప్రస్తావించారు.
 
  అదే విధానాన్ని అనుసరిస్తూ సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీ(మున్సిపాల్టీ, కార్పొరేషన్)లు అనుమతించిన లే అవుట్లనే రిజిస్ట్రేషన్  చేసేవిధంగా పురపాలక చట్టంలో సవరణలు తేవాలని ప్రభుత్వానికి విన్నవించింది.  అనుమతి ఉన్న లేఅవుట్ల వివరాలను సంబంధి ఏజెన్సీ వెబ్ సైట్లో పొందుపరిచితే, రిజిస్ట్రేషన్ల సమయంలో తనిఖీ చేసుకునేందుకు వీలుకలుగుతుందని పేర్కొన్నారు. అనుమతించిన లేఅవుట్ల వివరాలతో పాటు అనుమతి లేని లేఅవుట్ల వివరాలను కూడా వెబ్‌సైట్లో ఉంచితే, ఆయా లేఅవుట్లలోని ప్లాట్లను కొనుక్కోవాలనుకున్న ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి చేసిన సిఫారసుల్లో పేర్కొంది.
 
  ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు, అన ధికార లేఅవుట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి  రిజిస్ట్రేషన్ చట ్టంలోని సెక్షన్ 22ను తమిళనాడు ప్రభుత్వం 2011లోనే సవరించినా, న్యాయపరమైన చిక్కుల కారణంగా చట్ట సవరణ ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుందనే విషయమై తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ జారీ చేయకపోవడం గమనార్హం.
 

Advertisement
Advertisement