మేల్కొనకుంటే ముప్పే... | Sakshi
Sakshi News home page

మేల్కొనకుంటే ముప్పే...

Published Tue, Jun 17 2014 2:37 AM

మేల్కొనకుంటే ముప్పే...

గోదావరి వరదలతో అపార నష్టం
స్లూయిస్‌ల లీకులతోనే భద్రాద్రిలోకి వరద నీరు
కరకట్టల నిర్మాణంలో తీవ్ర జాప్యం
ముంపు మండలాలకే అధికంగా వరద తాకిడి
ఆంధ్రలో విలీనంతో అంతా గందరగోళం
 వరదలపై నేడు సమీక్ష సమావేశం

 
 భద్రాచలం :గోదావరి పరివాహక ప్రజలు వచ్చే మూడు నెలల పాటు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి. వరద సహాయక చర్యలు చేపట్టడం అధికారులకు సైతం కత్తిమీద సాము వంటిదే. ప్రతి ఏటా గోదావరి వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తున్నప్పటికీ విపత్తులతో ఈ ప్రాంతవాసులకు తీవ్ర నష్టమే వాటిల్లుతోంది. ముందస్తు ప్రణాళికలను క్షేత్ర స్థాయిలో అమలు చేయటంలో కొందరు అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంలా మారుతోంది. వరద ముంపు నుంచి కాపాడేందుకు కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ భూ సేకరణ సమస్యలతో ఈ పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. అలాగే వరదల సమయంలో రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలి చిపోయే ప్రమాదం ఉండడంతో ఆయా మండలాల్లో నిత్యావసర సరుకుల కొరత లేకుండా బఫర్ స్టాక్ పాయింట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాగా, ఈ ఏడాది వరదలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సంబంధిత జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ మంగళవారం జిల్లా కేంద్రంలో సమీక్షిస్తున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

స్లూయీస్‌ల లీకులతో భద్రాద్రికి ముప్పు...

గోదావరి నదికి మూడో ప్రమాద హెచ్చరిక దాటి వరద వచ్చిందంటే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరుతుంది. పట్టణం చుట్టూ కరకట్టలు ఉన్నప్పటికీ స్లూయీస్‌ల లీకేజీ వల్లే ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. వర్షపు నీటితో పాటు డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు నీటిని బయటకు పంపేందుకు కరకట్టలకు ఏర్పాటు చేసినా.. స్లూయీస్‌లను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయకపోవడం వల్లే ఈ సమస్య ఎదురవుతోంది. కేవలం వరదల సమయంలోనే హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోవటం లేదనే విమర్శ ఉంది. భారీ వర్షం పడితే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఆ సమయంలోనే స్లూయీస్‌ల లీకేజీల ద్వారా గోదావరి నీరు కూడా పట్టణంలోకి వస్తోంది. దీంతో రామాలయ పరిసర ప్రాంతాలు, అశోక్‌నగర్ కొత్తకాలనీ, సుభాష్ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునుగుతాయి. ఏటా ఇలానే జరుగుతున్నప్పటికీ సమస్య పరిష్కారంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సహాయక చర్యలే కీలకం...

విపత్తుల సమయంలో చేపట్టే సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం పొంగినప్పుడు బాధితులకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ అక్కడ తల దాచుకునే వారికి తగిన సహాయం అందటం లేదనే విమర్శ ఉంది. గత ఏడాది భద్రాచలంలోని తానీషా కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సరైన సౌకర్యాలు కల్పించకపోగా, కనీసం భోజనం కూడా పెట్టలేదని బాధితులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. పరామర్శకు వచ్చిన అప్పటి కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్‌ను నిలదీశారు. అలాగే భద్రాచలం మండలంలోని గన్నవరం గ్రామాన్ని ఏ ఒక్క అధికారి సందర్శించలేదని, వాజేడు వంటి మండలాలకు సెక్టోరియల్ అధికారలు సకాలంలో చేరుకోలేదని విమర్శలు వచ్చాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలెక్టర్ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ముంపు మండలాల పరిస్థితి ఏమిటో..

గోదావరి పరివాహక ప్రాంతంలోని 14 మండలాలకు వరద ముంపు ఉంటుందని అధికారులు గుర్తించారు. భద్రాచలం డివిజన్‌లోని ఎనిమిది మండలాలతో పాటు పాల్వంచ డివిజన్‌లోని పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరదల సమయంలో నీరు పోటెత్తి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోతాయి. వరద ఉధృతి మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తే తిరిగి నీటి మట్టం తగ్గేంత వరకూ భద్రాచలం నుంచి వాజేడు, వీఆర్‌పురం రహదాలను వరద నీరు ముంచెత్తుతుంది. అయితే ఈ 14 మండలాల్లో ప్రస్తుతం ఏడు మండలాలు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించారు. కాగా, వరదలొస్తే ఈ మండలాల్లో సహాయక చర్యలు ఎవరు చేపట్టాలనే దానిపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ మండలాలపై తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అజమాయిషీ లేని పరిస్థితుల్లో తమను ఎవరు ఆదుకుంటారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   
 
 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement