సలేశ్వరం.. భక్తసంద్రం | Sakshi
Sakshi News home page

సలేశ్వరం.. భక్తసంద్రం

Published Fri, Apr 3 2015 7:16 AM

సలేశ్వరం.. భక్తసంద్రం

అచ్చంపేట/మన్ననూర్ (మహబూబ్‌నగర్) : నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతర గురువారం ప్రారంభమైంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమికి రెండు రోజుల ముందే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తులు దట్టమైన అడవిలో రాళ్లు, రప్పల మధ్య కాలిబాటన నడిచి వెళుతున్నారు. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి రాంపూర్ చెంచుపెంట వరకు వాహనాలు బారులుతీరాయి. స్వామి దర్శనానికి వెళుతున్న ‘వస్తున్నాం లింగమయ్యా’ అంటూ తిరిగి వచ్చేవారు ‘పోయోస్తాం లింగమయ్య’ అంటూ అప్పనాలు చెప్పడంతో ఈప్రాంతం భక్తుల నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది. జిల్లాతోపాటు నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

కనిపించని అధికారుల పర్యవేక్షణ
దారి పొడువున అక్కడక్కడ ఇంత మట్టి చల్లి టోల్‌గేట్ అంటూ లక్షల రూపాయలు దండుకుంటున్న అటవీశాఖ భక్తుల రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఏళ్ల చరిత్ర కలిగిన సలేశ్వరం ఉత్సవాలకు ప్రభుత్వ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం. లక్షలాది మంది భక్తులు వస్తున్నా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కనిపించడం లేదు. ఈ ఏడాది చెంచు మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ శ్రీదేవి ప్రోత్సాహంతో ప్రమాదభరితంగా ఉన్న ఆలయం వద్దకు వెళ్లే దారిలో మెట్ల నిర్మాణాలు చేశారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందకు వచ్చి అన్ని ఏర్పాటు చేస్తుండటం విశేషం. వైద్య ఆరోగ్య శాఖ వైద్యశిబిరం ఏర్పాటు చేయలేదు .నాలుగేళ్లుగా అచ్చంపేట వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో రాంపూర్ చెంచుపెంట వద్ద భక్తుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది ఒక్కటే భక్తులకు దిక్కవుతుంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన గణేష్ సేవా సమితి అన్నదాన శిబిరం నిర్వహిస్తోంది.

Advertisement
Advertisement