రికవర్రీ | Sakshi
Sakshi News home page

రికవర్రీ

Published Thu, Feb 22 2018 4:19 PM

loan recovery a challenge to the banks - Sakshi

చర్చనీయాంశమైన ‘సాక్షి’ కథనం నీరవ్‌మోదీ తరహాలోనే ఆంధ్రాబ్యాంకు బోధన్‌ మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి రుణం తీసుకుని సుమారు రూ.23 కోట్లకు ఎగనామం పెట్టిన వ్యవహారంపై బుధవారం ‘సాక్షి’లో ‘జిల్లాలోనూ నీరవ్‌మోదీ’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. బ్యాంకు, వ్యాపార వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రుణం కోసం రైస్‌ మిల్లరు బ్యాంకులో సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువను వాల్యువర్‌ ఉద్దేశ పూర్యకంగానే అధికంగా చూపించినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఉన్నతాధికారుల ప్రమేయం ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పుకుంటున్నాయి.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఆంధ్రాబ్యాంకు బోధన్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో ఓ రైస్‌ మిల్లరు బకాయి పడ్డ రూ.23 కోట్ల రుణం కోసం సెక్యురిటీగా పెట్టిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లకు మించి లేకపోవడంతో సొమ్ము రికవరీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినట్లు సమాచారం. ఇలా బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టిన రైస్‌మిల్లర్‌ బ్యాంకులోని ఉన్నతాధికారులతో సంబంధాలు నెరిపినట్లు బ్యాంకు వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్థానికంగా అధికారులు ఏమైనా అభ్యంతరాలు తెలిపితే.. ఆ బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి చేయించే వారని చర్చించుకుంటున్నారు. అయితే ఉద్దేశపూర్వకంగా ఈ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. సెక్యురిటీ ఆస్తుల విలువ అంతగా లేకపోయినా.. రూ.కోట్లలో రుణం కట్టబెట్టడం వెనుక బ్యాంకు ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీగా పెట్టిన ఆస్తుల విలువను లెక్కించే వ్యాల్యువర్,రుణం మంజూరు చేసే మేనేజర్లు ఇవేవీ చూసుకోకుం డా రూ.కోట్లలో రుణం ఇవ్వడాన్ని బట్టి చూస్తే బలం చేకూరుతోంది. కాగా బ్యాంకులు బడా వ్యాపారులకు కల్లు మూసుకుని రూ.కోట్లలో రుణాలు మంజూరు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.  

దుబాయ్‌ చెక్కేసిన మరో మిల్లరు..
జిల్లాలోని మరో మిల్లరు కూడా నగరంలోని ప్రభుత్వరంగ జాతీయ బ్యాంకుకు పెద్ద మొత్తంలో కుచ్చుటోపి పెట్టారు. సుమారు రూ.9కోట్లు రుణం తీసుకున్న ఈ బడా రైస్‌మిల్లరు.. నీరవ్‌మోదీ తరహాలో దుబాయ్‌ వెళ్లిపోయినట్లు వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మిల్లరు సెక్యురిటీగా పెట్టిన ఆస్తు ల విలువ కూడా ఇచ్చిన రుణం విలువకు సమానంగా లేనట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఎనిమిది నెలల క్రితం వెలుగు చూసిన ఈ వ్యవహారం ఇప్పుడు నీరవ్‌మోదీ, రొటొమ్యాక్‌ కొఠారి కుంభకోణాల నేపథ్యంలో చర్చకొస్తోంది.  

ఆలయ స్థలానికీ రూ.లక్షల్లో రుణం..
నగరంలోని న్యాల్‌కల్‌రోడ్డులో గల కోదండ రామాలయానికి కొన్ని స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని సెక్యూరిటీగా పెట్టి ఓ జాతీయ బ్యాం కు నుంచి రూ.లక్షల్లో రుణం తీసుకున్న ఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. రుణం చెల్లిం చకపోవడంతో సదరు బ్యాంకు స్థలాన్ని వేలం నిర్వహించింది. వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తికి బ్యాంకు స్థలం అప్పగించగా అది ఆల య స్థలమని తేలింది. బ్యాంకు తనను మోసం చేసిందని వేలంలో స్థలాన్ని కొన్న వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా సామాన్య చిరు వ్యాపారులకు ముద్ర లోన్లు ఇవ్వడంలో చెప్పులరిగేలా తిప్పించి., నానా కొర్రీలు పెట్టే బ్యాంకు అధికారులు వ్యాపారులకు మాత్రం రూ.కోట్లలో నగదును కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సాధారణ ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకున్న డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంకు ఉన్నతాధికారులు బడాబాబులకు కట్టబెట్టడం తీవ్ర ఆరోపణలకు దారితీస్తోంది.    

Advertisement
Advertisement