లాక్‌డౌన్‌ మరింత కఠినం! | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌ మరింత కఠినం!

Published Tue, Apr 21 2020 10:46 AM

Lockdown Strictly Implemented in Containment Zones Hyderabad - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు పొడిగించినందున నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని పోలీసు బాసులు ప్రకటించారు. ప్రజలు ముఖ్యమైన పని ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హెచ్చరించారు. 

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 7 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. దీనికోసం మంగళవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహించనున్నట్లు ఆయన సోమవారం వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో 12 వేల మంది సిబ్బంది 24 గంటలూ విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. గడచిన మూడు రోజులుగా అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించిన నేపథ్యంలో అనేక ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గుర్తించారన్నారు. సోమవారం నగర కమిషనరేట్‌లో పని చేస్తున్న అందరు ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్విగ్గీ, జొమాటో వంటి వాటి ఫుడ్‌ డెలివరీని నిషేధించిన నేపథ్యంలో ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తే వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఫంక్షన్‌ హాళ్లలో శుభకార్యాలు వంటి కార్యకలాపాలు నిషేధించిన నేపథ్యంలో ఏ ఒక్క దాంట్లో అయినా జరిగినట్లు తెలిసినా, గుంపులు కనిపించినా ఆ ఫంక్షన్‌ హాల్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగర పోలీసు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకుని, పొందే ఈ–పాస్‌లు కలర్‌ లేదా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఏదో ఒక ప్రింట్‌ఔట్‌ తీసుకోవచ్చని వివరించారు. వీటిని దుర్వినియోగం చేస్తే అక్కడిక్కడ రద్దు చేయడంతోపాటు వాహనం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ప్రతి పండుగ, ప్రార్థనలను ప్రజలు తమ తమ ఇళ్లల్లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. తమ పరిధిలో 124 కంటైన్‌మెంట్‌ ఏరియాలు ఉన్నాయన్నారు. చెక్‌ పాయింట్లు 113 ఉన్నాయని.. వీటిని మరిన్ని పెంచే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 49,863 కేసులు నమోదు చేశామన్నారు. 69,288 వాహనాలను సీజ్‌ చేశామని కొత్వాల్‌ వెల్లడించారు.  

ప్రత్యేక టీమ్‌లతో నిఘా: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ పొడిగించిన నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్డుమీదికి రావొద్దని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో సీపీ హెచ్చరించారు. సైబరాబాద్‌లో మొదటిసారి లాక్‌డౌన్‌లో కొన్ని ఉన్న ఉల్లంఘనలు జరిగినప్పటికీ.. ప్రజలందరూ బాగా సహకరించారన్నారు. అదే స్ఫూర్తితో సహకరించాలన్నారు. ఈ సారి  ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని సజ్జనార్‌ హెచ్చరించారు. ‘నిబంధనల ప్రకారమే దుకాణాలను నడపాలి. నిర్దేశించిన సమయపాలన పాటించాలి. షాపుల యాజమానులు తమ కస్టమర్లు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చూడాలి. లేదంటే కేసులు నమోదు చేసి ఆయా షాపులను సీజ్‌ చేస్తాం. కమిషనరేట్‌ పరిధిలో మొదటిసారి లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన దాదాపు 10 వేల వాహనాలను సీజ్‌ చేశాము’ అని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కు పర్మిషన్‌ లేదన్నారు. ఫుడ్‌ డెలివరీ చేస్తామని వచ్చే మెసేజ్‌లకు, ఈ–మెయిల్‌లకు స్పందించవద్దన్నారు.

అద్దె అడిగితే 100కు కాల్‌ చేయండి...
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం ప్రకారం ఇళ్ల యజమానులు తమ కిరాయిదారుల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి అద్దెవసూలు చేయరాదని సీపీ తెలిపారు. వీటిని తర్వాత నెలల్లో వడ్డీ లేకుండా వాయిదా పద్ధతిలో అడ్జస్ట్‌ చేసుకోవాలి. కాబట్టి.. ఎవరైనా ఇబ్బంది పెడితే 100కు డయల్‌ చేయాలని సూచించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజులను నెలవారీగా మాత్రమే వసూలు చేసుకోవాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రత్యేక లాక్‌డౌన్‌ టీమ్‌లు
సైబరాబాద్‌లో ప్రత్యేక లాక్‌డౌన్‌ టీమ్‌లు ఏర్పాటు చేశాం. వీరు 24 గంటలూ పని చేస్తుంటారు. పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టం చేశాం. లాక్‌డౌన్‌ను పర్యవేక్షించడానికి అడిషనల్‌ డీసీపీ స్థాయి అధికారులను సూపర్‌వైజర్లుగా నియమించి ముఖ్యమైన ప్రాంతాలు, చెక్‌ పోస్ట్‌లలో నిఘా ఉంచాము’ అని సీపీ సజ్జనార్‌ వివరించారు.  

ఆన్‌లైన్‌ ఫుడ్‌ ప్రకటనలు నమ్మొద్దు : రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌
నేరేడ్‌మెట్‌: ఫుడ్‌డెలవరీ చేస్తామని వచ్చే ఆన్‌లైన్‌ ప్రకటనలు, మేసేజ్‌లకు స్పందించొద్దని రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ప్రజలకు సూచించారు. సోమవారం నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని కంటైన్మెంట్‌(శ్రీకాలనీ) ఏరియాను ఆయన పరిశీలించారు. అక్కడి బందోబస్తు, కాలనీవాసుల ఆరోగ్య పరిస్థితి, వైద్య పరీక్షలు, నిత్యావసరాల పంపిణీ తదితర అంశాలపై పోలీసులు, వైద్య, జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాలనీవారికి ఇబ్బందులు రాకుండా చూడాలని   సూచించారు. కంటైన్మెంట్‌ ప్రాంతంలోకి కొత్తవారు రాకుండా, లోపలి నుంచి బయటకు పోకుండా బందోబస్తు అమలు చేయాలని సీపీ ఆదేశించగా, డ్రోన్‌ కెమెరాతో కాలనీలోని ప్రజల కదలికలపై నిఘా పెట్టినట్టు సీఐ నర్సింహస్వామి వివరించారు.

అనంతరం సీపీ మాట్లాడుతూ... ప్రభుత్వం పలు సంస్థల ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీలను నిలిపివేసిందని, ఈ విషయంలో నకిలీ ప్రకటనలతో సైబర్‌నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉన్నందున ప్రజలు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలవరీలకు ఆర్డర్లు చేయొద్దన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడగించినందున, ప్రజలు పూర్తి సహకారం అందించాలని  విజ్ఞప్తి చేశారు. పదేపదే కూరగాయలు, ఇతర సరుకుల కోసం బయటకు రాకుండా ఒకేసారి నాలుగు రోజులకు సరిపడ సరుకులను కొనుగోలు చేసుకోవాలన్నారు.  సమయపాలన పాటించని దుకాణదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో మార్చి నుంచి మే నెల వరకు అద్దెల కోసం కిరాయిదారులను ఇబ్బంది పెట్టొదని ఇంటి యజమానులకు సీపీ సూచించారు.  

బారికేడ్ల ఎత్తు పెంచండి...
కీసర/శామీర్‌పేట్‌:  కరోనా కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన చీర్యాలలో సోమవారం రాచకొండ సీపీ మహేష్‌ భగవత్, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తితో కలిసి పర్యటించారు. బందోబస్తుతో పాటు, వివిధ అంశాలపై పోలీస్‌ అధికారులు, వైద్యసిబ్బంది, పంచాయతీ సిబ్బందితో సమీక్షించారు.  బారికేడ్ల ఎత్తును 8 అడుగులకు పెంచాలని సూచించారు. అనంతరం పంచాయతీ సిబ్బందికి మాస్కులు, నిత్యావసరాలు అందజేశారు.

Advertisement
Advertisement