ఆపరేషన్‌ హైదరాబాద్‌ | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ హైదరాబాద్‌

Published Thu, Apr 23 2020 8:39 AM

Lockdown Strictly Implemented in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చినవారు, మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారి నుంచే కరోనా వైరస్‌ ఇతరులకు వ్యాపిస్తున్నట్లు భావించాం. కానీ ప్రస్తుతం ఏ కాంటాక్ట్‌ హిస్టరీ లేని వారిలోనూ వైరస్‌ వెలుగు చూస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందిలో కనీసం లక్షణాలు కూడా కన్పించకపోవడంతో ఎవరిలో వైరస్‌ ఉందో? ఎవరికి లేదో? గుర్తించడం కష్టమవుతోంది. ర్యాపిడ్‌ టెస్టులతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆ టెస్టులను కూడా నిలిపివేసింది. దీంతో పాజిటివ్‌ కేసులే కాదు.. వారికి సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం వైద్య ఆరోగ్యశాఖకు ఇబ్బందిగా మారింది. మరో రెండు రోజుల్లో రంజాన్‌ మాసం ప్రారంభం కాబోతోంది. మసీదుల్లో ప్రార్థనలకు అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇతర బంధువులంతా ఒకేచోట చేరి సామూహిక ప్రార్థనలు చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చైన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌కు బ్రేక్‌ వేయడం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది.  (మనం మారకుంటే భారీ నష్టమే..)

ఆరా తీస్తున్నా.. తగ్గని ఉద్ధృతి..
చైన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ బ్రేక్‌ చర్యల్లో భాగంగా ఇప్పటికే ఎంపిక చేసిన కంటైన్మెంట్‌ జోన్లలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి రోజూఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఇంట్లో ఎరికైనా దగ్గు, జలుబు, జ్వరం, మధుమేహం, హైపర్‌ టెన్షన్, కేన్సర్‌ వంటి ఇతర జబ్బులేమైనా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తోంది. నిత్యావసరాలతో పాటు మందులు అందజేస్తోంది. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని వెంటనే క్వారంటైన్‌ సెంటర్‌కు పంపి, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోగా గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 30 పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసక్తికరమైన అంశమేమంటే.. ఎలాంటి కాంటాక్ట్‌ హిస్టరీ.. లక్షణాలు లేని వారిలోనూ కరోనా పాజిటివ్‌ వెలుగు చూస్తుండటం ఆందోళనకు  గురి చేస్తోంది.

క్వారంటైన్‌ గడువు 28 రోజులకు పెంపు..
చైన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ బ్రేక్‌లో భాగంగా ఇప్పటి వరకు కేసుల నమోదైన ప్రాంతాలను 14 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని అమలు చేసింది. ఇప్పటికే క్వారంటైన్‌ పీరియడ్‌ను పూర్తి చేసుకున్న వారిలోనూ తాజాగా వైరస్‌ వెలుగు చూస్తుండటంతో ప్రభుత్వం ఈ అంశంపై మరింత విస్తృత చర్చలు జరిపింది. ప్రస్తుతం ఉన్న క్వారంటైన్‌ సమయాన్ని 28 రోజుకు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా రంజాన్‌ మాసంలో వైరస్‌ విస్తరణ లేకుండా జాగ్రత్త పడొ చ్చని భావిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారి నుంచి మాత్రమే నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచడం ద్వారా వైరస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చని భావించి ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో నుంచి వచ్చిపోయే ప్రభుత్వ ఉద్యోగులపై కూడా ఆంక్షలు విధించించడం గమనార్హం.  (బతుకు చిత్రం మారుతోంది!)

కంటైన్మెంట్‌ సెంటర్లలో పరిస్థితి ఇలా...
కూకట్‌పల్లి: కూకట్‌పల్లి నియోజకవర్గంలో నాలుగు పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. జోన్‌ పరిధిలోని బోయినపల్లి, హస్మత్‌పేట్, ఎల్లమ్మబండ, కేపీహెచ్‌బీ పరిధిలో కంటైన్‌మెంట్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోజూ జీహెచ్‌యంసీ, ఆరోగ్య, పోలీస్‌  అధికారులు ప్రజలకు సేవలు అందిస్తున్నారు.  కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో పాత కంటైన్‌మెంట్‌ సెంటర్‌లనే కొనసాగిస్తున్నట్లు జోనల్‌ కమిషనర్‌ మమత తెలిపారు. 

అంబర్‌పేట్‌లో తగ్గుతున్నాయి..
అంబర్‌పేట: నియోజకవర్గంలో కంటైన్మెంట్‌ ప్రాంతాలు క్రమంగా తగ్గుతున్నాయి. నాలుగు రోజుల క్రితం రామకృష్ణానగర్‌లో కరోనా బాధితుడి క్వారంటైన్‌ పూర్తి కావడంతో ఆప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌ నుంచి తొలగించారు. గోల్నాక గంగానగర్‌లో ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

మలక్‌పేట్‌ పరిధిలో 48..
దిల్‌సుఖ్‌నగర్‌: మలక్‌పేట్, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని బాలాçపూర్‌ కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మొత్తం 18 పాజిటివ్‌ కేసులు, మలక్‌పేట్‌ కంటైన్మెంట్‌ క్లస్టర్‌లో మొత్తం 48 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాలాపూర్‌ (జల్‌పల్లి మున్సిపాలిటీ), మలక్‌పేట్‌ కంటైన్మెంట్‌ కస్టర్ల పరిధిలోని వాదే ముస్తఫా, షాహిన్‌నగర్, మిలాన్‌కాలనీ, కొత్తపేట, బిస్మిల్లాఖాన్‌ కాలనీ, పహాడీషరీఫ్, ఓల్డ్‌ మలక్‌పేట, శంకర్‌నగర్, వాహెద్‌నగర్, కాలాడేరా, అజంపురం, న్యూమలక్‌పేట్,  రేస్‌కోర్స్‌ ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులను ఇళ్ల వద్దకే పంపిణీ చేస్తున్నారు.  

నర్సుకు పాజిటివ్‌
చాదర్‌ఘాట్‌: అక్బర్‌బాగ్‌ డివిజన్‌ పరిధిలోని జడ్జెస్‌ కాలనీకి చెందిన ఓ నర్సుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. బుధవారం వైద్యశాఖ అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆ ప్రాంతాన్ని క్వారంటైన్‌ జోన్‌గా ప్రకటించారు. 

చార్మినార్‌లోని నాలుగు సర్కిళ్లలో..
చార్మినార్‌: జోన్‌ పరిధిలోని నాలుగు సర్కిళ్లలో కంటైన్మెంట్‌ క్లస్టర్లు కొనసాగుతున్నాయి. ఇందులో సంతోష్‌నగర్‌ సర్కిల్‌ 7లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. యాకుత్‌పురా నియోజకవర్గ పరిధిలో ముగ్గురు వ్యక్తులు కరోనాతో మృతి చెందారు. వారి నుంచి కరోనా పాజిటివ్‌ ప్రైమరీ కాంటాక్టస్‌ పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 15 కంటైన్మెంట్‌ క్లస్టర్లు కొనసాగుతుండగా, 58 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో ముగ్గురి పరిస్థితి మెరుగు పడడంతో ఇప్పటికే డిశ్ఛార్జి అయ్యారు. మరో 53 మంది చికిత్స పొందుతున్నారు. చాంద్రాయణగుట్ట సర్కిల్‌ 8లో 10 క్లస్టర్లుండగా.. 35 మంది కరోనా పాజిటివ్‌తో వైద్య సేవలు పొందుతున్నారు. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. చార్మినార్‌ సర్కిల్‌ 9లో నాలుగు కంటోన్మెంట్‌ క్లస్టర్లు కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. మరో 7 మంది కరోనా పాజిటివ్‌తో వైద్య సేవలు పొందుతున్నారు. ఫలక్‌నుమా సర్కిల్‌–10లో 6 కంటైన్మెంట్‌ క్లస్టర్లు కొనసాగుతుండగా ఇద్దరు మృతి చెందారు. 25 మంది కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. 

యునానీ ఆసుపత్రిలో..  
చార్మినార్‌ యునానీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 38 మంది క్వారంటైన్‌లో ఉండగా ఇందులో 26 మందికి నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. వీరందరినీ డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం 12 మంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు.  

మేడ్చల్‌ పరిధిలో..
మేడ్చల్‌: కీసర మండలం చీర్యాలలో కరోనాతో ఒకరు మృతి చెందడంతో ఆ గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. శామీర్‌పేట్‌ మండలం తుర్కపల్లి గ్రామంలో రెండు కేసులు రెండు నమోదు కావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా అధికారులు ప్రకటించి చర్యలు చేపట్టారు. తుర్కపల్లి గ్రామానికి చెందిన 46 మందిని రాజేంద్రనగర్‌లోని కంటైన్మెంట్‌కు తరలించి పరీక్షలు చేసి వారం తర్వాత హోం క్వారంటైన్‌కు తరలించారు. చీర్యాలలో మూడు కేసులు నమోదు కావడంతో  గ్రామంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. గ్రామంలో 80 మంది వరకు రాజేంద్రనగర్‌లోని క్వారెంటైన్‌కు తరలించి పరీక్షలు చేశారు. ఇద్దరు మినహా మిగతా వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 

కంటైన్మెంట్‌ జోన్లలో రెండంచెల భద్రత
గచ్చిబౌలి: కంటైన్మెంట్‌ జోన్‌లలో పోలీసులు రెండంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. చందాగనర్, శేరిలింగంపల్లి సర్కిళ్ల పరిధిలో 9 కంటైన్‌మెంట్‌ జోన్‌లు ఉన్నాయి.    కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో బుధవారం ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని 8 క్లస్టర్లలో దాదాపు 800 ట్యాబ్లెట్లను పంపిణీ చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లకు ఈ ట్యాబ్లెట్లను అందజేశారు.  

సనత్‌నగర్‌లో..
సనత్‌నగర్‌: నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎనిమిది పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ఐదుగురు కోలుకొని  డిశ్చార్జి అయ్యారు. మిగిలిన ముగ్గురి ఆరోగ్యం సైతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. రాంగోపాల్‌పేట డివిజన్‌లో అత్యధికంగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, బేగంపేట పాటిగడ్డలో ఒకటి, అమీర్‌పేట డివిజన్‌ బల్కంపేటలో మరో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాంగోపాల్‌పేట డివిజన్‌ జీరా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి దుబాయ్‌ నుంచి వస్తూ కరోనాను మోసుకువచ్చారు. దీంతో ఆయన భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి.

వీరే కాకుండా కరోనా లక్షణాలతో సదరు వ్యాపారి కోడలు, మనువడు, మనుమరాలు, వారి కారు డ్రైవర్, పని మనిషిలతో పాటు వారితో సన్నిహితులు పది మందిని పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్‌గా వచ్చింది. సౌదీ నుంచి వచ్చిన బేగంపేట డివిజన్‌ పాటిగడ్డకు చెందిన వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జి అయ్యి హోం క్వారంటైన్‌కు చేరుకున్నారు. బల్కంపేటలోని ఓ వ్యక్తి సైతం కోలుకుని హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా  రాంగోపాల్‌పేట్, నల్లగుట్టలో ఇరాన్‌కు చెందిన వ్యక్తితో పాటు ఇద్దరు స్థానికులకు కరోనా పాజిటివ్‌ రావడంతో వీరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వీరితో కాంటాక్ట్‌ అయిన వారందరి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

దారులు బంద్‌
ఎల్‌బీనగర్‌: వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని ఇంజినీర్స్‌ కాలనీ, చంపాపేట డివిజన్‌ పరిధిలోని మారుతీనగర్‌లలో రెండు కరోనా పాజిటివ్‌లు నమోదు కావడంతో ఆ కాలనీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి ఆయా ప్రాంతాలకు వెళ్లే దారులను మూసివేశారు.   
సికింద్రాబాద్‌: సర్కిల్‌ పరిధిలో కంటైన్మెంట్ల సంఖ్య ఆరుకు చేరింది. ఇప్పటికే లాలగూడ, మెట్టుగూడ, శ్రీనివాస్‌నగర్, కౌసర్‌ మసీద్, బౌద్ధనగర్‌ ప్రాంతాల్లో కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్తగా షాబాద్‌గూడలో మరో కంటైన్మెంట్‌ను ఏర్పాటు చేశారు. షాబాద్‌గూడలో కొత్తగా నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతంలో కంటైన్మెంట్‌ ఏర్పాటు చేశారు.   
కుత్బుల్లాపూర్‌: సర్కిల్‌లోని చంద్రగిరినగర్‌లో 5, కళావతినగర్‌లో 5, సుభాష్‌నగర్‌లో 2, అపురూపా కాలనీ1, మోడీ అపార్ట్‌మెంట్‌లో 2, ప్రగతినగర్‌లో 2 చొప్పున కోవిడ్‌–19 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలన్నీ అధికారులు కంటైన్మెంట్‌గా గుర్తించి పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. కరోనా లక్షణాలు కలిగిన మరో 10 మందికి రిపోర్టులు రావాల్సి ఉంది.  

అమరజ్యోతి కాలనీలో కలకలం
కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌ అమరజ్యోతి కాలనీలో కరోనా అనుమానిత కేసుతో స్థానికంగా ఆందోళన నెలకొంది. తాడ్‌బంద్‌లోని కరూర్‌ వైశ్యాబ్యాంకు సీనియర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సహోద్యోగులందరికీ పరీక్షలు నిర్వహించారు. దీంతో అమ రజ్యోతి కాలనీలోని ఉద్యోగిని, ఆమె కుటుంబ సభ్యులూ పరీక్షలు నిర్వహించడంతో పాటు క్వారంటైన్‌కు తరలించారు.

సబ్జిమండిలో ఇద్దరికి పాజిటివ్‌
జియాగూడ: ఆగ్రా నుంచి మర్కజ్‌ ప్రయాణికులతో కలిసి నగరానికి చేరుకున్న వారిలోని కుటుంబ సభ్యులకు ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.ఈ ఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం...సబ్జిమండి దర్వేజ్‌ ఫంక్షన్‌హాల్‌కు ఎదురుగా నివసిస్తున్న ఓమహిళకు ఇద్దరు కొడుకులు, ఒక కోడలు ఉన్నారు. గత నెల 17న ఆగ్రా నుంచి మర్కజ్‌ యాత్రికులతో కలిసి ఆమె కుమారుడితో నగరానికి వచ్చారు. అనుమానతో వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా ఇద్దరికి పాజిటివ్‌గా వచ్చింది. దీంతో సబ్జిమండి ప్రాంతలో కంటైన్మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement