Sakshi News home page

ఉల్లంఘిస్తే ఊర్కోం!

Published Fri, Apr 17 2020 11:43 AM

Lockdown Strictly Implemented in Hyderabad Anjani kumar - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్‌ కట్టడికి కీలక మార్గమైన లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై బుధవారం నుంచి కఠిన చర్యలు ప్రారంభించామని, కొందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు ఆయన గురువారం వెల్లడించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్‌ ఆడియో సందేశం విడుదల చేశారు. కరోనాపై చేస్తున్న యుద్ధంలో పోలీసు, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖలతో పాటు ప్రజలు పాలుపంచుకుంటున్నారని అన్నారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానుసారం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నగర పోలీసు విభాగం నిర్విరామంగా 24 గంటలూ పని చేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకుంటోందన్నారు. ప్రజల నుంచి పూర్తి సహకారం అందనిదే ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. నగరంలోని ప్రజల్లో 99 శాతం లాక్‌డౌన్‌ను పాటిస్తున్నా.. ఒక్క శాతం మాత్రం నిర్లక్ష్యం చేస్తూ రోడ్లపైకి వచ్చి అందరికీ ఇబ్బందికరంగా మారుతున్నారని కొత్వాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి కుటుంబ పెద్ద తన ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా బాధ్యత తీసుకోవాలని కోరారు. కేవలం అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని ఆయన సూచించారు. అకారణంగా రోడ్లపైకి వస్తూ లాక్‌డౌన్‌ నిబంధనల్ని తీవ్రస్థాయిలో అతిక్రమిస్తున్న 18 మందిపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 3500 మందిపై పెట్టీ కేసులు పెట్టామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన 14 సంస్థలపై ఎఫ్‌ ఐఆర్‌లు రిజిస్టర్‌ చేయగా.. మరో 300 వరకు పెట్టీ కేసులు పెట్టినట్లు తెలిపారు. మరోపక్క ట్రాఫిక్‌ విభాగం అధికారులు మొత్తం 17 వేల మంది ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసి 2,724 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిలో 2,379 టు వీలర్లు, 167 త్రీ వీలర్లు, 178 తేలికపాటి వాహనాలు ఉన్నాయన్నారు. 1,147 మంది వాహనచోదకులు ఎలాంటి అత్యవసరం లేకుండా రోడ్లపైకి వచ్చినందుకు కేసు నమోదు చేశామని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిషేధించినా ఒకే వాహనంపై ఇద్దరు ప్రయాణించినందుకు 1,359 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు.

57 మంది ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తూ చిక్కడం, మరో ఐదుగురు మైనర్లు వాహనాలు పడుపుతూ పట్టుబడటం ఆశ్చర్యంగా ఉందని కొత్వాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ తమ మైనర్లు వాహనాలు తీసుకుని బయటకు వెళ్లడానికి తల్లిదండ్రులు ఎలా అంగీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతి కుటుంబమూ ఈ పరిస్థితుల్లో సమగ్రంగా స్పందిస్తేనే కరోనా కట్టడి సాధ్యమని పేర్కొన్నారు. ఇకపై లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో నగర ప్రజల సహకారం కావాలని కోరారు. పోలీసులు తమ కుటుంబాలను విడిచిపెట్టి ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా వారికి సహకరించాలని కోరారు. మీ ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా వాళ్లు తమతో వైరస్‌ను మోసుకువచ్చి అందరినీ ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement