అసలు సమస్య ఆ 6%

25 Apr, 2020 05:32 IST|Sakshi

లాక్‌డౌన్‌ ఎందుకు పెట్టారో తెలియని వారు 6 శాతం

ఇష్టానుసారంగా రోడ్లపైకి వచ్చేది వీరే

వైరస్‌ క్యారియర్లుగా మారే ప్రమాదం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌ ఉల్లంఘనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో ప్రజలు నూటికి నూరు పాళ్లు సహకరిస్తుంటే.. పట్టణాల్లో మాత్రం లాక్‌డౌన్‌ ఆశయాన్ని నీరుగార్చేలా.. పోలీసుల ప్రయత్నాలను అపహాస్యం చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎంతకాలం కొనసాగించాలి? అన్న అంశంపై ఆన్‌లైన్‌లో తెలంగాణ పోలీసులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. అందులో లాక్‌డౌన్‌ను సమర్థిస్తూ దాదాపుగా 94 శాతం మంది మద్దతు తెలిపారు.

కానీ, కేవలం 6 శాతం మంది మాత్రం లాక్‌డౌన్‌ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అన్న విషయాలపై అస్సలు తమకు ఐడియానే లేదని సమాధానమిచ్చారు. వీరితోనే అసలు సమస్య అని పోలీసులు పేర్కొంటున్నారు. వీరికి కనీసం లాక్‌డౌన్‌ సమయాలపై కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. అందుకే, ఇష్టానుసారంగా వేళాపాళా లేకుండా బయటికి వస్తున్నారు. వీరు వైరస్‌ క్యారియర్లుగా మారితే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముం దని పోలీసులు ఆందోళన చెందుతున్నారు.

వీరే ప్రమాదం.. 
లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న వారిలో జిల్లాల వాసులు, గ్రామీణులు ముందున్నా.. నగరాలు, పట్టణాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ పోకడలు గ్రేటర్‌ పరిధిలో మరీ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన లక్షకుపైగా వాహనాలు కేవలం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే కావడం విశేషం. వీరికి నిబంధనల పట్ల ఏమాత్రం లెక్కలేదన్న విషయం దీనితో తేటతెల్లమవుతోంది.

ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే కావడం గమనార్హం. ఉల్లంఘనల శాతం జిల్లాల్లో 30 శాతంగా ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం 50 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాతబస్తీలో లాక్‌డౌన్‌ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. లాక్‌డౌన్‌ అంటే అస్సలు ఐడియాలేని వారిలో ఇక్కడే అధికంగా ఉన్నారు. ఈ ఆరుశాతం మంది కరోనా వైరస్‌ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం పూట సడలింపుతో.. 
సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. కానీ, ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది భౌతికదూరాన్ని పాటించడం లేదు. అసలే కరోనా పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ మొదటిస్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతుంటే.. ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అసలు లాక్‌డౌన్‌ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు