ప్రేమజంట పరార్ | Sakshi
Sakshi News home page

ప్రేమజంట పరార్

Published Thu, Oct 9 2014 1:57 AM

ప్రేమజంట పరార్

 హాలియా : నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయారు. విషయం తెలిసి అమ్మాయి తరఫు బంధువులు అబ్బాయి ఇంటిపై దాడి చేయడం, దానికి వారు ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో హాలియాలోని ఎస్సీ కాలనీలో తీ వ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీ కాలనీకి చెందిన మారపాక నరేష్(20), పడిగిమర్రి సునిత(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమవ్యవహరం పెద్దలకు తెలియడంతో గతంలోనే మందలించారు. దీంతో ఇద్దరు సోమవారం ఇళ్ల నుంచి పారిపోయారు. సునిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిం చారు. దీంతో వారు నరేష్ పెంపుడు తండ్రి వెంకటయ్యను పిలిపించి ఆచూకీ కోసం విచారించారు.వారి ఆచూకీ తెలుసుకుని తీసుకొస్తానని చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.
 
 గుర్తుతెలియని వ్యక్తుల దాడి
 వెంకటయ్య మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు వచ్చి దాడిచేశారు. ఇంట్లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు వెంకటయ్యను చితకబాదారు. బాధితుడి అరుపులు విని చట్టుపక్కల వారు రావడంతో గుర్తుతెలియని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన వెంకటయ్యను తొలుత సాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది.
 
 యువతి బంధువు ఇంటిపై..
 మారపాక వెంటయ్యపై దాడిచేయించింది నకిరేకంటి సైదులే అని ఆరోపిస్తూ కాలనీవాసులు సుమారు 200 మం ది అతడి ఇంటిపై దాడిచేశారు. దీంతో సైదులు భయాందోళన చెంది ఇంటి వెనుక నుంచి పరారయ్యాడు. కాంగ్రెస్ నాయకుడు కుందూరు వెంకట్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో కాలనీవాసులు సైదులును అప్పగించాలని కోరినా వెంకట్‌రెడ్డి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు అతడి ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని పోలీ సులు వచ్చి కాలనీవాసులను చెదరగొట్టి సైదులును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 
 కాలనీని సందర్శించిన ఏఎస్పీ
 ఇరువర్గాల ఘర్షణ విషయం తెలుసుకుని ఏఎస్పీ రమారాజేశ్వరి హాలియా ఎస్సీ కాలనీని సందర్శించారు. ఘర్షణకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కాలనీలో పది మంది ఎస్‌ఐలు, సీఐతో పాటు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఆమె వెంట మిర్యాలగూడ డీఎస్పీ కుంచ మోహన్, సీఐ శివశంకర్‌గౌడ్, ఎస్‌ఐలు సురేష్‌కుమార్, రాజశేఖర్‌గౌడ్ ఉన్నారు.
 
 కేసు నమోదు
 సునీతను అపహరించాడనే అభియోగంతో నరేష్‌పై కిడ్నాప్ కేసు,పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన సుమారు 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement
Advertisement