రెవెన్యూ అంటే సేవ.. వసూళ్లు కాదు | Sakshi
Sakshi News home page

రెవెన్యూ అంటే సేవ.. వసూళ్లు కాదు

Published Thu, Feb 18 2016 3:18 AM

రెవెన్యూ అంటే సేవ.. వసూళ్లు కాదు

బాగా పనిచేస్తే అవార్డులిస్తాం.. ప్రజలను ఇబ్బంది పెడితే శిక్షిస్తాం
‘మా భూమి’ పోర్టల్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

 సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ అంటే ప్రజలకు సేవ చేయడమేనని, వారి వద్ద నుంచి సొమ్ములు వసూలు చేయడం ఎంత మాత్రం కాదని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి మహమూద్ అలీ చెప్పారు. బుధవారం భూ పరిపాలన కార్యాలయంలో ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌తో పాటు మరో మూడు రెవెన్యూ వెబ్‌సైట్లు... ‘లోన్ చార్జ్ మాడ్యూల్, రెక్టిఫికేషన్ మాడ్యూల్, సీసీఎల్‌ఏ’లను ఆయన ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... ‘జననం నుంచి మరణం వరకు ప్రజల జీవితంలో ఎన్నో అంశాలు రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉన్నాయి. ఎంతో కీలకమైన ఈ వ్యవస్థలో బాగా పనిచేసే వారికి అవార్డులిస్తాం. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఆసరా, ఆహార భద్రత, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ , మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. తదితర ప్రభుత్వ పథకాలన్నీ రెవెన్యూ శాఖ సహకారంతోనే విజయవంతంగా అమలవుతున్నాయి.

నూతన పారిశ్రామిక విధానం మాదిరిగానే రెవెన్యూ సేవలన్నీ ప్రజలకు నిర్ధేశిత సమయంలో లభించేలా నూతన రెవెన్యూ విధానాన్ని త్వరలో తెస్తాం. ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేను రెండేళ్లలో పూర్తి చేస్తాం. దీని కోసం సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న 2,500 సర్వేయర్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆదేశాలిచ్చాం’ అన్నారు. ప్రతి వ్యక్తీ తన భూమి వివరాలను ఇంట్లో నుంచి తెలుసుకునేలా మా భూమి పోర్టల్, ఇతర వెబ్‌సైట్లు రూపొందించిన రెవెన్యూ, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. సీసీఎల్‌ఎ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, సీసీఎల్‌ఏ కార్యదర్శి రవీంద్రబాబు, హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ హోళీకేరి, డిప్యూటీ కలెక్టర్లు సత్యశారద, నిఖిల, రఘురామ్‌శర్మ, తహసీల్దార్ల సం ఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు.
 
 ఆవిష్కరించిన వెబ్‌సైట్ల వివరాలివీ...
 మా భూమి ప్రజాపోర్టల్

 రాష్ట్రంలోని  ఏప్రాంతంలో ఉండే రైతయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు అవకాశం కల్పి స్తూ.. కొత్తగా‘మా భూమి’ప్రజాపోర్టల్‌ను సీసీఎల్‌ఏ రూపొందించారు. ఈ పోర్టల్‌లో సర్వే, ఖాతా, ఆధార్ నంబర్లు, పట్టాదారు పేర ు తదితర వివరాలను ఎంటర్ చేస్తే రైతుకు కావల్సిన వ్యక్తిగత పహాణీ ప్రత్యక్షమవుతుంది. అలాగే ఆర్‌వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) 1-బి, టిప్పన్ (సర్వే నంబరు కొలతలు) తదితర రికార్డులు డిజిటలైజ్డ్ కెడస్ట్రియల్ విలేజ్ మ్యాప్ (గ్రామ పట ం)లను కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.  

 లోన్ చార్జ్ మాడ్యూల్
 వ్యయ ప్రయాసలు లేకుండా రైతులు వ్యవసాయ రుణాలు పొందేలా లోన్  చార్జ్ మాడ్యూల్‌ను రూపొందించారు. రైతు లేదా కౌలు రైతు బ్యాంకుకు వెళ్లి తాను సాగు చేస్తున్న భూమి సర్వే నంబరును అధికారులకు చెబితే చాలు.. బ్యాంకు అధికారులు తమ వెబ్‌సైట్లో పరిశీలించి వెంటనే రుణం మంజూరు చేస్తారు. దీనికోసమని సీసీఎల్‌ఏ వెబ్‌ల్యాండ్ డేటాబేస్‌ను బ్యాంకులకు లింక్ చేస్తున్నారు. సర్వే నంబరును ఎంటర్ చేస్తే సదరు భూమి సొంతదారు/హక్కుదారు/కౌలుదారు, సాగుచేస్తున్న పంట, భూమి విస్తీర్ణం, గతంలో వేరే ఏవైనా ఇతర బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారా.. తదితర వివరాలన్నీ అందులోనే ప్రత్యక్షమవుతాయి.

 రెక్టిఫికేషన్ మాడ్యూల్
 మా భూమి పోర్టల్‌లో తమ భూముల రికార్డులను చూసుకున్న యజమానులు వాటిలో (సర్వే నెంబర్లు, పట్టాదారు పేరు, విస్తీర్ణం తదితర వివరాలు) తప్పులున్నట్లు గమనిస్తే సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్‌ను రూపొందించారు.

 సీసీఎల్‌ఏ వెబ్‌సైట్
 భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయం వెబ్‌సైట్‌ను కొత్తగా రూపొందించారు. సీసీఎల్‌ఏ సమాచారంతో పాటు సర్వే అండ్ ల్యాండ్  రికార్డ్స్, భూ భారతి, యూఎల్సీ విభాగాల సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు.

Advertisement
Advertisement