అధికారుల గైర్హాజరుపై జేసీ ఆగ్రహం

5 Nov, 2019 08:09 IST|Sakshi
ఫిర్యాదులు స్వీకరిస్తున్న మహబూబ్‌నగర్‌ జేసీ స్వర్ణలత

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌):  ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించాలని, ఆలస్యం చేయవద్దని జేసీ స్వర్ణలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఆమె ఫిర్యాదులు స్వీకరించారు. అయితే, ప్రజావాణికి మున్సిపల్‌ అధికారులు హాజరు కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖ అధికారులు కచ్చితంగా హాజరు కావాలని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌కు ఫోన్‌ చేసి ప్రజావాణికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. శాఖ నుంచి ఓ అధికారిని ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో మున్సిపల్‌ శాఖకు చెందిన ఫిర్యాదులు వస్తాయని ఆ శాఖ అధికారి లేకుంటే ఎలా అన్నారు.  కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ ప్రేమ్‌రాజు, ఐసీడీఎస్‌పీడీ శంకరచారీ, ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్యాంసుందర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
నారాయణపేట: సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఇచ్చిన ప్రతీ ఫిర్యాదును వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెంకట్రావ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాయలంలో ప్రధానంగా భూసమస్యలు, కొత్తపాసుపుస్తకాలు, రికార్డుల సవరణ, భూ సర్వే, పించన్లు తదితర వాటిపై వినతలను అందజేశారు. సంబంధిత అధికారులకు వినతులను పంపించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కలెక్టర్‌ ఫిర్యాదుదారులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ చీర్ల శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ కాళిందిని, ఏఓ బాలాజీ, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ఎస్పీకి 12 ఫిర్యాదులు
ప్రజావాణిలో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్‌ చేతనకు 12 ఫిర్యాదులు అందాయి. ఈమేరకు ఎస్పీ వారితో మాట్లాడుతూ చట్టప్రకారం పరిష్కరించాల్సినవి తమ పరిధిలో ఉన్నవాటిని పరిశీలిస్తామని, కోర్టు పరిధిలో ఉంటే ఆవి అక్కడే పరిష్కారమవుతాయని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత సీఐ, ఎస్‌ఐలకు పంపించి పరిష్కరిస్తామన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా