ఏకమై టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొందాం..! | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 11:22 AM

Mahabubnagar, Non TRS Parties Planning to tie up in Forthcoming elections - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయపార్టీల పొత్తులు.. ఎత్తులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే పాలమూరు ప్రాంతంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొట్టేందుకు విపక్షాలన్నీ మూకుమ్మడి పోరాటం చేయాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు, టీజేసీ(తెలంగాణ జన సమితి), తెలంగాణ ఇంటి పార్టీలు ఉమ్మడిగా పోరాడాలని భావిస్తున్నాయి.

మరోవైపు తెలంగాణ జన సమితిలో... తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసే దిశగా కసరత్తు సాగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో దిగాలని చాలా మంది నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో ఆయా పార్టీల్లో నేతలను ఎవరెవరిని ఎక్కడెక్కడ సర్దుబాటు చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే పాలమూరు రాజకీయ ముఖచిత్రం రసవత్తరంగా మారింది.   

బలపడిన టీఆర్‌ఎస్‌
పాలమూరు ప్రాంతంలో అధికార టీఆర్‌ఎస్‌ గతంతో పోలిస్తే బలపడింది. గత సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు గాను సగం సీట్లే ఆ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా సగం స్థానాలు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ గెలుచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా పాలమూరు ప్రాంతంలో ఆశించిన స్థాయిలో మెరుగైన స్థానాలను గెలుచుకోలేకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తదనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌... పాలమూరుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతిష్టాత్మకమైన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి బీడు భూములకు సాగునీరు అందిస్తున్నారు. ఫలితంగా నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో లక్షల ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. దీంతో ఒక విధంగా రైతుల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీపై సానుకూలత వ్యక్తమవుతోంది. అంతేకాదు రాజకీయ పునరేకీకరణ పేరుతో విపక్షాలకు చెందిన వారిని పెద్ద సంఖ్యలో పార్టీలోకి చేర్చుకున్నారు. ఫలితంగా పాలమూరులో టీఆర్‌ఎస్‌ పార్టీ కాస్త బలోపేతమైందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి.   

ఆ స్థానాలపైనే చిక్కుముడి
టీఆర్‌ఎస్‌ను డీ కొట్టేందుకు సాగుతున్న కసరత్తులో భాగంగా విపక్షాలు ఏకమవుతున్నా సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని స్థానాల విషయంలో పీటముడి తప్పేలా లేదు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, మక్తల్‌ శాసనసభ స్థానాల విషయం లో గట్టి పోటీ తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి అన్ని పార్టీలకు చెందిన నేతలు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతూ ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

మహబూబ్‌నగర్‌ సీటుపై తీవ్రపోటీ
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్, యువనేత ఎం.సురేందర్‌రెడ్డి, ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఎన్‌.పీ.వెంకటేశ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి తోడు తెరవెనక మరో ముగ్గురు, నలుగురు అభ్యర్థులు సైతం ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. ఇంకోపక్క టీజేసీ నుంచి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పోటీకి సై అంటున్నారు. గత ఎన్నికల్లోనే రాజేందర్‌రెడ్డి బరిలో దిగేందుకు ఆఖరి నిముషం వరకు శతవిధాల ప్రయత్నం చేసినట్లు అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితిల్లో బరిలో నిలవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

అందుకు అనుగుణం గా ఉమ్మడి జిల్లాలో కోదండరామ్‌కు బలమైన మద్దతుదారుగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. తాజాగా కోదండరాం ప్రారంభించిన తెలంగాణ జన సమితి పార్టీ ఉమ్మడి జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవానికి స్వయంగా ఆయననే తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఇంటి పార్టీని... టీజేసీలో విలీనం చేసేందుకు భారీ కసరత్తు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇంటి పార్టీ లో అతికీలకమైన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సైతం మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సీటుపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇలా మహబూబ్‌నగర్‌ అసెంబ్లీకి ఎనలేని పోటీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి.

మరో మూడు స్థానాలదీ అదే పరిస్థితి
మహబూబ్‌నగర్‌ అసెంబ్లీతో పాటు మరో మూడు చోట్ల కూడా విపక్షాల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చని చెబుతున్నారు. టీడీపీతో కాంగ్రెస్‌ పార్టీ జట్టు కడితే రాజకీయ సమీకరణాలేమినేది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో టీడీపీకి రెండు లేదా మూడు స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం టీడీపీకి నాలుగు నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నారు. జడ్చర్ల నుంచి ఎర్ర శేఖర్, వనపర్తి నుంచి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల నుంచి సీతమ్మ, దయాకర్‌రెడ్డి పోటీకి సై అంటున్నారు.

అయితే జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గత 15 ఏళ్లుగా సీనియర్‌ నేత మల్లు రవి అంటిపెట్టుకున్నారు. అదే విధంగా నాలుగు పర్యాయాలు అక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎర్ర శేఖర్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్లు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే వనపర్తిలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి, టీడీపీ తరఫున రావుల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ డి.పవన్‌కుమార్‌ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతమ్మ సైతం పోటీకి సై అంటున్నారు.

మక్తల్‌లో కూడా కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచేందుకు జెడ్పీటీసీ శ్రీహరి, ఎన్నారై గల్ప్‌ విభాగం కన్వీనర్‌ నంగి దేవేందర్‌రెడ్డి తహతహలాడుతున్నారు. అలాగే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని యోచిస్తున్నారు. ఇలా మొత్తం మీద ఎవరి ఎత్తులు వారికి ఉండడంతో పొత్తులు ఏం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement