సీఎం కుర్చీ లాగుతాం | Sakshi
Sakshi News home page

సీఎం కుర్చీ లాగుతాం

Published Mon, May 11 2015 12:58 AM

Malala mahagarjana on May 10

మాలల మహాగర్జన బహిరంగ సభలో కేసీఆర్‌కు వక్తల హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: దళితులకు మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం స్థానం కల్పించకుంటే మరో ఉద్యమం చేయాల్సి వస్తుందని, సీఎం కుర్చీ లాగేస్తామని మాలల మహాగర్జన బహిరంగసభలో వక్తలు హెచ్చరించారు. ఏడు శాతంగా ఉన్న అగ్రకులాలవారికి మంత్రివర్గంలో 11 మంత్రి పదవులిచ్చి, 17 శాతంగా ఉన్న ఎస్సీలకు ఒకటి, 51 శాతంగా ఉన్న బీసీలకు 4 మంత్రి పదవులిచ్చి వివక్ష చూపారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య (ఎంఎంఏకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల మహాగర్జనలో పలువురు నేతలు ప్రసంగించారు.

ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు రాందాసు అథవాలె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలిచిన ఎస్సీలకు ప్రాధాన్యత  ప్రకారం మంత్రివర్గంలో స్థానం కల్పించాలన్నారు. ప్రాణాలర్పించైనా మాలలు హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.  హిందువులుగా మారిన ముస్లింలు, క్రిస్టియన్లను ఘర్ వాపసీ చేయాలని, లేనిపక్షంలో బుద్ధిస్టులుగా మార్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాగ్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.  జాతీయ దళిత్ ముక్తి మోర్చా అధ్యక్షుడు, ప్రొఫెసర్ జోగేంద్ర ఖవాడె మాట్లాడుతూ.. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన కేసీఆర్ హామీని విస్మరించారని, చివరికి మంత్రివర్గంలో కూడా దళితులకు న్యాయం కల్పించలేదని విమర్శించారు.

పార్లమెంటు, శాసనసభ హాళ్లల్లో అంబేడ్కర్ విగ్రహాలు పెట్టాలని దీక్ష చేసిన ఎంపీ కవితకున్న జ్ఞానం కూడా ఆమె తండ్రి, సీఎం కేసీఆర్‌కు లేదని ఎద్దేవా చేశారు. దళితులను అణచి వేసే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి కుర్చీని లాగేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎంఎంఏకేఎస్ చైర్మన్ సుద్దాల దేవయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్  ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, ప్రజాగాయకురాలు విమలక్క , మాల- మాల అనుబంధ కులాల సమాఖ్య(ఎంఎంఏకేఎస్) నాయకులు బాలనాథం, మంద భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement