పారిశ్రామిక గుమ్మం | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక గుమ్మం

Published Sun, Oct 19 2014 2:41 AM

పారిశ్రామిక గుమ్మం - Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సింగరేణి బొగ్గు గనులు, అపార అటవీ సంపద, ఇతర సహజ వనరులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఖమ్మం.. పారిశ్రామిక రంగం వైపు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాలో లభిస్తున్న ఖనిజ సంపదను వినియోగించి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడి నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బయ్యారంలోని అపార  ఖనిజ సంపదను పూర్తిస్థాయిలో వినియోగించి అక్కడ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఫలించబోతోంది.

ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయడంతో  ఏజెన్సీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నిర్ణయాలతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వాలు దీనికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభించకపోవడంతో జిల్లా ప్రజల్లో ఒకింత ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల విలువ గల ఖనిజ సంపద గల ఈ ప్రాంతంలో కర్మాగారం నిర్మిస్తారా.. లేదా.. ముడిసరుకు రవాణాకు అనువైనప్రాంతంలో ఫ్యాక్టరీని నిర్మిస్తారా..? అనే అంశంపై ఇంకా జిల్లా ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం వచ్చే రెండేళ్లల్లో పూర్తవుతుందనే ఆశ ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది.

అలాగే జిల్లాలో మరో పారిశ్రామిక వాడగా ఎదగడానికి అన్ని హంగులున్న మణుగూరులో సైతం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు జిల్లా ప్రజలు చిరకాలంగా చేస్తున్న పోరాటం ఫలించినట్టే అని తెలుస్తోంది. తెలంగాణకు ఖమ్మం జిల్లాను విద్యుత్ హబ్‌గా మార్చాలనే కేసీఆర్ కృతనిశ్చయం..  జిల్లా ప్రజల జీవన ప్రమాణాల్లో కొత్త వెలుగులు నింపుతుందన్న గంపెడాశ వ్యక్తమవుతోంది. అలాగే కొత్తగూడెంలో సైతం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించడానికి వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.

దీనికి సంబంధించి అన్ని రకాల పాలనా పరమైన ఆటంకాలను అధిగమించడానికి అధికారులను ఫైళ్లతో పరుగుల తీయిస్తోంది. భూ సేకరణ, నిర్వాసితుల నష్ట పరిహారం తదితర అంశాలను సత్వరమే పరిష్కరించడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టుకు తుది రూపం రానుంది. అలాగే విస్తారమైన బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి ప్రాంతంలో సైతం మరో విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రమైన ఖమ్మం రూపురేఖలు అభివృద్ధి పరంగా మారనున్నాయి.

జిల్లాలో కొత్తగా అపార బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించిన సింగరేణి సంస్థ అక్కడ బిగ్గు తవ్వకాలను సత్వరం ప్రారంభిస్తే కొత్తగా నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టులకు చేదోడుగా వాదోడుగా ఉండటంతోపాటు జిల్లాలోని వేలాది మందికి  ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఖమ్మం గ్రానైట్ నిరంతర విద్యుత్ కోతల వల్ల సంక్షోభంలో కూరుకుపోతోంది. గ్రానైట్ ఉత్పత్తికి సంబంధించి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నా విద్యుత్‌కోత గ్రానైట్ వ్యాపారుల పట్ల శాపంగా మారింది. వేలాది మంది ఆధారపడి ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనిస్తే జిల్లాలో ఈరంగం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్న విశ్వాసం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

జిల్లాలోని గిరిజనులు తమ ఉపాధికి ప్రధాన మార్గంగా ఎంచుకున్న తునికాకు సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు సరైన విధానం అమల్లో లేదు. దీంతో గిరిజనులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గిరిజనుల ఉపాధి పరిరక్షణకు భద్రాచలం ప్రాంతంలో బీడీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెలంగాణ ప్రభుత్వంలోనైనా సాకారమైతే  తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని గిరిజనులు గంపేడాశలతో ఉన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలతో పారిశ్రామిక వాడగా వెలుగొందుతున్న పాల్వంచలో ఎరువుల కర్మాగారం నిర్మించాలన్న డిమాండ్ సైతం ఆది నుంచి ఉంది. దీనిపై సైతం ప్రభుత్వం ఒకింత దృష్టి సారిస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుగులేని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.

Advertisement
Advertisement