మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం | Sakshi
Sakshi News home page

మార్లవాయిని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Published Mon, Jan 12 2015 10:04 AM

marlavai@ model village

నార్నూర్(జైనూర్) : ఎంతో చరిత్ర కలిగిన మార్లవాయి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ అన్నారు. ఆదివారం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో హైమన్‌డార్ఫ్ దంపతుల వర్ధంతి ఘనంగా నిర్వహించారు. సహాయ మంత్రి లక్ష్మి, ఎమ్మెల్యే రేఖానాయక్, ఎంపీ గెడం నగేష్ హైమన్‌డార్ఫ్ దంపతుల సమాధుల వద్ద సంప్రదాయబద్ధంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేసిన మానవ పరిణామక్రమ శాస్త్రవేత్త హైమన్‌డార్ఫ్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. హైమన్‌డార్ఫ్ వర్ధంతిని అధికారింగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
 
ఆదివాసీ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణ కోసం కృషి చేసిన ఆ దంపతులను ఎప్పటికీ మరువలేమని అన్నారు. గ్రామంలో రూ.6కోట్లతో ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు సహాయ మంత్రి కోవ లక్ష్మి తెలిపారు. కొమురం భీమ్ స్వగ్రామమైన జోడేఘాట్‌ను రూ.25 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. హైదారాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆదివాసీల కోసం ఆదివాసీ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించిందని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

గిరిజనుల సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో పెందూర్ భీము, ఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు, ఆర్డీవో ఐలయ్య, ఎంపీడీవో దత్తరాం, తహశీల్దార్ వర్ణ, ఏజెన్సీ డీఈవో సనత్‌కుమార్, ఎంపీపీ కొడప విమలప్రకాష్, కోఆప్షన్ సభ్యులు సబుఖాన్, ఏజెన్సీ ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు మర్సుకోల తిరుపతి, సర్పంచులు భీంరావ్, బొంత ఆశరెడ్డి, లక్ష్మణ్, ఆదివాసీ సంఘాల నాయకులు లక్కేరావ్, వెడ్మా బొజ్జు, సీతారామ్, అంబాజీ, ఐటీడీఏ మాజీ చైర్మన్ అర్జు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనక యాదవ్‌రావ్, రాయ్‌సెంటర్ జిల్లా మెడి మేస్రం దుర్గు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement