అంగారక యాత్ర.. 39 రోజులే! | Sakshi
Sakshi News home page

అంగారక యాత్ర.. 39 రోజులే!

Published Mon, Apr 13 2015 2:52 AM

అంగారక యాత్ర.. 39 రోజులే! - Sakshi

మానవాళికి మరో పుడమి కాగలదని భావిస్తున్న అరుణగ్రహాన్ని చేరాలంటే ఇప్పుడు కనీసం 9 నెలలు పడుతోంది. అందుకే మానవ సహిత అంగారక యాత్ర ఇంకా సాధ్యం కావడం లేదు. అయితే, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నం ఫలిస్తే గనక.. మార్స్ యాత్ర ఇక 39 రోజులే! విదేశాలకు వెళ్లినట్లు ఇలా వెళ్లి.. అలా వచ్చేయొచ్చు! ఇదెలా సాధ్యం అంటే.. అంగార కుడి  చెంతకు మనల్ని కొన్ని రోజుల్లోనే చేర్చే అసలుసిసలు ప్లాస్మా రాకెట్ ఇంజన్ ‘వసీమర్’ రూపు దిద్దుకుంటోంది మరి!
 
ఏమిటీ ప్లాస్మా ఇంజన్..?
మామూలు రాకెట్ ఇంజన్ల మాదిరిగా రసాయన ఇంధనాలతో కాకుండా ప్లాస్మాను వేడిచేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. ‘వేరియేబుల్ స్పెసిఫిక్ ఇంపల్స్ మ్యాగ్నెటోప్లాస్మా రాకెట్(వసీమర్)’ అనే ఈ ఇంజన్‌ను అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ‘యాడ్ ఆస్ట్రా రాకెట్’ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఇంజన్‌ను మూడు సంవత్సరాల్లోగా సిద్ధం చేసేందుకు నాసా ఈ కంపెనీకి రూ. 62 కోట్ల నిధులు ప్రకటించింది. అయితే, భూమిపై నుంచి రాకెట్లను ప్రయోగించే ఇంజన్ కాదిది. అంతరిక్షంలోకి చేరిన వ్యోమనౌకలను మాత్రమే ఇది అత్యధిక వేగంతో ముందుకు తీసుకుపోతుంది.
 
ఎలా పనిచేస్తుంది..?
విద్యుదావేశ వాయువు(ప్లాస్మా)ను రేడియో తరంగాల ద్వారా అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడిచేస్తుంది. దీనివల్ల బలమైన అయస్కాంత క్షేత్రాలు ఏర్పడి ప్లాస్మాను ఇంజన్ వెనకవైపు గుండా అత్యధిక బలంగా తోస్తాయి. ప్లాస్మా వేగంగా వెనక్కి వెళ్లడం వల్ల ఇంజన్ అనూహ్య వేగంతో ముందుకు దూసుకెళుతుంది.
 
ప్రయోజనాలేంటి..?
అంగారకుడు భూమికి అతిదగ్గరగా వచ్చినప్పుడు సుమారుగా 5.46 కోట్ల కి.మీ., అతిదూరంగా ఉన్నప్పుడు 40 కోట్ల కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. మార్స్ స్థానాన్ని బట్టి ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత టెక్నాలజీతో అంగారకుడి దగ్గరికి వెళ్లేందుకు 9 నెలలు పడుతుంది. కానీ అక్కడి నుంచి తిరిగి బయలుదేరాలంటే ఏడాదిపాటు ఆగాల్సిందే. ఆ తర్వాత మళ్లీ 9 నెలలు ప్రయాణి ంచి భూమికి తిరిగిరావాల్సి ఉంటుంది. అంటే.. ఒక మార్స్ యాత్రకు మూడేళ్లు పడుతుందన్నమాట! అదే వసీమర్ ఇంజన్ అందుబాటులోకి వస్తే మానవసహిత మార్స్ యాత్రలు ఎంతో సులభం. గ్రహశకలాలను భూమికి దగ్గరగా తీసుకొచ్చి వాటి నుంచి ఖనిజాలను తవ్వుకునే వ్యోమనౌకలకూ ఈ ఇంజన్ ఉపయోగపడుతుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement