పట్టు.. బెట్టు | Sakshi
Sakshi News home page

పట్టు.. బెట్టు

Published Tue, Jul 14 2015 2:24 AM

పట్టు.. బెట్టు

- పట్టు వీడని ప్రభుత్వం
- మెట్టు దిగని కార్మిక సంఘాలు
- పోలీసులతోనైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతాం
- విధుల నుంచి తొలగిస్తాం
- సర్కారు హెచ్చరిక
- బెదరని కార్మికులు
సాక్షి, సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రోజురోజుకూ పరిస్థితి చేయి దాటుతోంది. విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు దిగివచ్చేది లేదని కార్మిక సంఘాలు పంతాలకు పోతున్నాయి. సమ్మె ప్రారంభమై వారం రోజులు దాటినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పదో పీఆర్‌సీకిఅనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులకు రూ.14,170, ఇతర కార్మికులకు రూ.17,380 చెల్లించాల్సిందేనని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.

వేతనాలు పెంచేందుకు సిద్ధంగానే ఉన్నామని, వెంటనే విధులో ్లచేరాల్సిందిగా ప్రభుత్వం చేసిన వినతిని సంఘాలు పట్టించుకోలేదు. ఎంత పెంచుతారో చెప్పకుండా సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం అంతే స్థాయిలో పట్టుదలకు పోతోంది. పోలీసులను రంగంలోకి దింపైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొండిగా వ్యవహరిస్తే మంగళవారం నుంచి ఆర్మీ, పోలీసులు, ఇతర ఉద్యోగులను ఉపయోగించుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.

సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని హెచ్చరించింది. సీఎం అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఉదయంలోగా విధుల్లో చేరకుంటే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ పరిధిలోని కార్మికులంతా విధిగా హాజరయ్యేలా చూడాలన్నారు. శాశ్వత ఉద్యోగులుగా ఉన్న కార్మికులు గైర్హాజరైతే సీసీఏ నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
 
నాయకుల వల్లనే....
కొంతమంది సంఘాల నాయకుల ఉచ్చులో పడి కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం అభిప్రాయపడింది. ఔట్‌సోర్సింగ్  కార్మికులు కార్పొరేషన్ ఉద్యోగులు కాదని గుర్తించింది. అయినా... వారి పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నామని పేర్కొంది. సమ్మె విరమణ కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఆదివారం రాత్రి నుంచి విస్తృత ప్రయత్నాలు చేశారు. విధుల్లోకి రావాలని... వేతనాలు పెంచే పూచీ తనదని హామీ ఇస్తూ కార్మికులందరికీ ఎస్‌ఎంఎస్‌లు పంపారు. సోమవారం ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సీఎం ఇచ్చిన హామీని గుర్తు చేశారు.

నగరంలో నిర్మించనున్న రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో జీహెచ్‌ఎంసీ కార్మికులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తాను కమిషనర్‌ను కాగానే రూ.6,500గా ఉన్న వేతనాన్ని రూ.8,500కు పెంచామన్నారు. రంజాన్, బోనాల పండుగలు, వర్షాకాలం దృష్ట్యా వెంటనే సమ్మె విరమించాలని కోరారు. మరోవైపు తమ వేతనం  రూ.14,170కి పెంచే  వరకు వెనకడుగు లేదని కార్మిక సంఘాలు భీష్మించుకు కూర్చున్నాయి. ఈ ఒక్క డిమాండ్ తీరిస్తే ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరుతారని, మిగతా వాటి గురించి ఆలోచించరని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు.
 
ఎవరెవరు?
మిగతా కేటగిరీల్లో వర్క్ ఇన్‌స్పెక్టర్లు (పట్టభద్రులు), డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు, సీఏడీ ఆపరేటర్లు, జీఐఎస్ అనలిస్టులు, టీమ్‌లీడర్లు, కోఆర్డినేటర్లు, డ్రాఫ్ట్స్‌మెన్, ఓఎస్సార్టీ అనలిస్టులు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు (ఐటీఐ/నాన్ టెక్నికల్), ఎలక్ట్రీషియన్లు, లైన్‌మన్లు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్లు, రవాణా విభాగంలో డ్రైవర్లు, సీనియర్ ప్రోగ్రామర్లు, హెల్త్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ఉన్నారు.
 
ఇవి నాలుగో తరగతి ఉద్యోగులకు సంబంధించినవి. మిగతా కేటగిరీల్లో సెమి స్కిల్డ్, స్కిల్డ్, సుపీరియర్ కేటగిరీలు ఉన్నాయి. నాలుగో తరగతి ఉద్యోగులు దాదాపు 24,800 మంది ఉన్నారు. మిగతావారు మరో రెండు వేల మంది.

Advertisement
Advertisement