మక్కా.. లుక్కేద్దాం ఎంచక్కా | Sakshi
Sakshi News home page

మక్కా.. లుక్కేద్దాం ఎంచక్కా

Published Sun, Jun 15 2014 12:41 AM

మక్కా.. లుక్కేద్దాం ఎంచక్కా

  •      రంజాన్‌కు ముస్తాబవుతున్న మక్కా మసీదు
  •      నగరాన్ని చరిత్ర పుటల్లో నిలిపిన అద్భుత కట్టడం
  •      దేశంలోని పురాతన మసీదుల్లో ప్రత్యేక గుర్తింపు   
  • చార్మినార్: రంజాన్ మాసం ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రంజాన్ ఉపవాస దీక్షల ప్రారంభానికి ఇక రెండు వారాలే మిగిలి ఉంది. రంజాన్ మాసానికి ముందు వచ్చే షబ్-ఏ-బరాత్ భక్తి శ్రద్ధలతో ముగిసింది. దీంతో ఈ నెల 30నుంచి రంజాన్ మాసం ప్రారంభం కావచ్చునని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. సామూహిక ప్రార్ధనలు, ఖురాన్ పఠనంతో పాటు ఉపవాస దీక్షలను సైతం మక్కా మసీదు ప్రాంగణంలో ముగిస్తారు.

    రంజాన్ ఉపవాస దీక్షల అనంతరం చేసే ఇఫ్తార్ విందులకు మక్కా మసీదు వేదికగా మారుతుంది. రంజాన్ మాసంలో మక్కా మసీదు విద్యుత్ దీప కాంతులతో కళకళలాడుతుంది. సాధారణ రోజుల కంటే రంజాన్ మాసంలో మసీద్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నగరంతోపాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో మక్కా మసీదు సందర్శించి ప్రార్ధనలు నిర్వహిస్తారు. దీనికోసం మక్కా మసీదు అందంగా ముస్తాబవుతోంది. అవసరమైన అన్ని హంగులను ఏర్పాటు చేస్తున్నారు.
     
    మక్కా నుంచి రాళ్లు తెప్పించి కట్టినందుకే...
     
    దేశంలో గల అతి పెద్ద పురాతన మసీదుల్లో నగరంలో ఉన్న మక్కా మసీదు ఒకటి. చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడానికి అతి సమీపంలో దక్షిణం వైపున సుమారు 100 గజాల దూరంలో మక్కా మసీదు ఉంది. మహ్మద్ ప్రవక్త మక్కాలో నిర్మించిన మసీదు నుంచి కొన్ని రాళ్లు తీసుకొచ్చి ఈ మసీదు నిర్మాణానికి ఉపయోగించారని చెబుతుంటారు. అందుకే దీనికి మక్కా మసీదని పేరొచ్చినట్లు చరిత్రకారుల అభిప్రాయం. మక్కా మసీదులోని ఆవరణలో ఎడమ వైపు ఉన్న బల్లపై ఒకసారి కూర్చుంటే మక్కా మసీదు సందర్శన కోసం మళ్లీ వస్తారనేది నమ్మకం.
     
    నిర్మాణంలో మట్టికి బదులు రాళ్ల పొడి...
     
    మక్కా మసీదు నిర్మాణంలో ఎక్కడా మట్టిని వాడలేరు. రాళ్ల పొడిని మాత్రమే ఉపయోగించారు. మక్కా మసీదు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఓ పెద్ద రాతి కొండను ఎంపిక చేశారు. కొండను తొలిచి తెచ్చిన ఎత్తై రాళ్లతో మక్కా మసీదు నిర్మాణం జరిగింది. ఆ రాళ్లను ఎండ్ల బండ్ల ద్వారా మక్కా మసీదుకు తీసుకొచ్చారు.
     
    ఒకేసారి 3వేల మందికి ప్రార్థన చేసుకునే విధంగా...
     
    దాదాపు ఒకేసారి 3 వేల మంది ఈ హాల్‌లో ప్రార్థనలు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు. మక్కా మసీదు ఎత్తు 176 అడుగులు, మక్కా మసీదు లోపల 67 మీటర్ల పొడవు, 54 మీటర్ల వెడల్పు, 23 మీటర్ల ఎత్తు గల విశాలమైన ప్రార్థనా మందిరం ఉంది. మక్కా మసీదు నిర్మాణం 1617లో ప్రారంభమై 1690 నాటికి పూర్తి నిర్మాణం రూపుదిద్దుకుంది. మసీదుకు దక్షిణంలో ఐదుగురు ఆసఫ్‌జాహీ రాజులు, వారి కుటుంబ సభ్యుల సమాధులు 14 ఉన్నాయి.

Advertisement
Advertisement