మేడారం జాతరలో కొత్త ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

ముగిసిన మేడారం జాతర

Published Sat, Feb 8 2020 4:53 PM

Medaram Sammakka-saralamma jatara ends as deities return to forest - Sakshi

సాక్షి, భూపాలపల్లి :  మేడారం మహా జాతర ముగింపులో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది. ఎప్పటిలాగా జాతర ముగియగానే సమ్మక్క-సారలమ్మను వనప్రవేశం చేస్తారు. అయితే ఈ సారి ఈ తంతు నిర్వహించాల్సిన ఆదివాసీ పూజారులు అలిగి కూర్చున్నారు. దేవతలను తీసుకుపోమంటూ భీష్మించుకుపోయారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు జరగాల్సిన ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. దీంతో అధికారులు బుజ్జగింపు చర్యలకు దిగారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. మరోవైపు ఎమ్మెల్యే సీతక్క ఆదివాసీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మక్క-సారలమ్మ వనప్రవేశం చేశాయి. (వన దేవతలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు)

మరోవైపు మేడారంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో జాతరకు తరలి వచ్చిన భక్తులు వర్షంలో తడిసి ముద్దయ్యారు. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇక జాతర ముగింపు సందర్భంగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మేడారం జాతరను ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజు 15 లక్షల మందిని దేవాలయానికి పంపించడం ఒక ఘనత. జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అని తెలిపారు.


జాతీయ పండుగగా ప్రకటించండి
మేడారం మహా జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండాకు.. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలో కుంభమేళా తర్వాత అత‍్యధిక సంఖ్యలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న జాతరగా మేడారంకు ఈ గుర్తింపును ఇవ్వాలని కోరారు. శనివారం సమ్మక‍్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చిన అర్జున్‌ ముండాకు మేడారంలో ఇంద్రకరణ్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. (మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు)

Advertisement
Advertisement