వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ | Sakshi
Sakshi News home page

వచ్చే నెలనుంచి కాలేజీల విలీన పక్రియ

Published Wed, Jan 24 2018 7:54 PM

Merging of degree colleges starts from next month - Sakshi

ఎంజీయూ(నల్లగొండ రూరల్‌) : వచ్చే నెల నుంచి రాష్ట్రంలో డిగ్రీ, పీజీ ప్రైవేట్‌ కళాశాలల విలీన ప్రక్రియను చేపడతామని రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్‌ చైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో నిర్వహించిన రీసెర్చ్‌ మెథడాలజీ మూడు రోజుల వర్క్‌ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1100 డిగ్రీ, పీజీ కాలేజీలు ఉన్నాయని, అడ్మిషన్లు లేని డిగ్రీ, పీజీ కాలేజీలు 55, 20 శాతం అడ్మిషన్లు ఉన్న కాలేజీలు150 ఉన్నాయన్నారు. దోస్త్‌ ఆన్‌లైన్‌ (డిగ్రీ అడ్మిషన్లు)అడ్మిషన్లు 4 లక్షల 10 వేల సీట్లు ఉండగా గత ఏడాది 1 లక్ష 80 వేల సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. 400 డిగ్రీ కాలేజీలు అదనంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఒక మండలంలో 2, 3 డిగ్రీ కాలేజీల నుంచి పూర్తిస్థాయి అడ్మిషన్లు లేనపుడు వాటిని విలీనం చేయడం వల్లా క్వాలిటి విద్య పెరగడంతో పాటు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 కాలేజీల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామన్నారు.

2018–19 కి విద్యార్థులు తరగతి గదుల్లో ఉండాలి.. ఉపాధ్యాయులు బోధించాలే... అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. యూనివర్సిటీకి, పరిశ్రమల మధ్య అనుసంధానం ఏర్పడడంతో పాటు అధ్యాపకులకు నైపుణ్యం పెంచేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే విధంగా నైపుణ్యాలను పెంచుతామన్నారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు బెస్ట్‌ రీసెర్చ్‌ అవార్డు ఇస్తామన్నారు. సీబీసీఎస్‌ విధానం విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. బయోమెట్రిక్‌ అన్ని కళాశాలల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.  

కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలు
 విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరానికి చేరుకుంటారని  అన్నారు.  విద్యపై  విద్యార్థులు దృష్టి సారించాలని, తరగతులకు రాకపోతే ఏమాత్రం ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్‌ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు నైపుణ్యం పెంచి ఉద్యోగం, ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం ప్రయత్నంతోనే విజయం సాధిస్తామన్నారు.   ఎంజీ యూనివర్సిటీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. విద్యార్థికి నచ్చిన సబ్జెక్ట్‌ చదువుకోవడానికి సీబీసీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.

యూనివర్సిటీ వీసీ అల్తాఫ్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ విద్యార్థులు రెగ్యులర్‌గా రాలేకపోతే దూరవిద్య ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు చదువు పైనే దృష్టి ఉండాలన్నారు. రూరల్‌ ఎంగేజ్‌మెంట్‌ను రాష్ట్రంలోనే మొదటిసారిగా యూనివర్సిటీలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. పరిశోధన విధానంపై 23, 24, 25 తేదీల్లో 500 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్టార్‌ ఉమేశ్‌ కుమార్, రమేష్,రవి, లక్ష్మీ ప్రభా, సరిత, వసంత, తదితరులు పాల్గొన్నారు.  

అక్రమ నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక
యూనివర్సిటీలో జరిగిన అక్రమ అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిపారు. నియామకాలపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్టు వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement