కల్యాణ ఘడియలకు కరోనా ‘వర్జ్యం’ | Sakshi
Sakshi News home page

కల్యాణ ఘడియలకు కరోనా ‘వర్జ్యం’

Published Tue, Apr 14 2020 5:16 AM

Millions of weddings in Telangana was stopped with Corona Effect - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదని నానుడి. కానీ, కరోనా వస్తే వివాహమే కాదు.. సమస్తమూ ఆగిపోతాయనేది ప్రస్తుతం ఒరవడి. సాధారణంగా శ్రీరామనవమి వేళ రాములోరి పెళ్లి అనంతరం వివాహాలు ఊపందుకుంటాయి. పెళ్లంటే ఆ సందడే వేరు. ఈసారి కరోనా దెబ్బకు ఆ సందడి, సంతోషం మాయమయ్యాయి. పెళ్లంటే నూరే ళ్ల పంట అనే సంగతి దేవుడెరుగు.. పెళ్లి, విందుల పేరుతో పది మందీ గుమికూడితే కరోనాతో కొత్త తంటా అనే ఉద్దేశంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఏటా ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా లక్షల వివాహాలు జరుగుతుంటాయి.  కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్‌కు ముందే కుదుర్చుకున్న పెళ్లిళ్లు సైతం అనేక ఆంక్ష లు, షరతుల మధ్య పదుల సంఖ్యలోనే జరిగాయి. ఆ తరువాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిళ్లు ఇప్పట్లో జరిగే అవకాశం లేక వాయిదా వేసుకుంటున్నారు. ఒక సందర్భంలో సీఎం కేసీఆర్‌..పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వారిని అభినందించారు.

పెళ్లి.. ఫంక్షన్‌ వాయిదా..
కరోనా పంజా విసరడం, లాక్‌డౌన్‌ విధించడం పెళ్లిళ్లపై పెద్ద ప్రభావమే చూపింది. ఇప్పటికే జరిగిన పెళ్లిళ్లను చాలాచోట్ల నలుగురైదుగురితో మమ అనిపించగా, ఇకముందు జరగాల్సిన వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ఏప్రిల్‌ 15, 16, 26, 27, మే 2, 6, 8, 14, 17, 18, 24, జూన్‌ 10, 11, 14, 15, జూలై 24, 25, 26, 29, ఆగస్టు 2, 3, 5, 6 ,8, 13, 14 తేదీల్లో ముహూర్తాలు ఉండగా, ఈ తేదీల్లో లక్షల్లో వివాహాలు కుదిరి ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా నవంబర్‌ 19, 25, 30, డిసెంబర్‌ 2, 9, 10, 16, 17, 23, 27 తేదీల్లోనూ పెళ్లిళ్లకు పలువురు ప్లాన్‌ చేసుకున్నారు.

వీరంతా లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో జూన్‌ వరకు వివాహాల వాయిదాకే మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే పరిస్థితులు కుదుటపడితే శ్రావణమాసంలో లేదా వచ్చే ఏడాది జరిపించే యోచనలో ఉ న్నారు. ఫలితంగా మార్చి నుంచి మే వరకు కిటకిటలాడే ఫంక్షన్‌ హాళ్లు బోసిపోయాయి. తీసుకున్న అడ్వాన్సులు సైతం వెనక్కివ్వాల్సిన పరిస్థితి.. ఇక, వీటిలో పనిచేసే వందలాది కార్మికులు ఖాళీ అయిపోయారు. ఫొటోగ్రాఫర్లు, స్టూడియోలు, బ్యూటీషియన్లు, మ్యారేజ్‌బ్యూరోలు, బ్యాండ్‌ మేళాలు, టెంట్‌హోస్‌ నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు.

పెళ్లిళ్లూ లేవు.. పూజలూ లేవు
ఈ సీజన్‌లో పురోహితులకు మంచి డిమాండ్‌.. మార్చి నుంచి మధ్యలో కొన్ని రోజులు మినహా శ్రావణ మాసం వరకు వీరు దొరకడమే గగనమయ్యేది. ముందే కుదుర్చుకున్న ముహూర్తాలతో ఇతర ముహూర్తాలు పెట్టడానికి, శుభకార్యాలు నిర్వహించడానికి సమయం లేదని చెప్పేవారు. అలాంటిది ఇప్పు డు పెళ్లిళ్లే కాదు.. గుడిలో పూజలకూ దూరమై ఖాళీ అయిపోయారు. తమకు ఫోన్‌ చేసిన వారికి పెళ్లి వాయిదా వేసుకోవాలని, వీలుంటే వచ్చే ఏడాది చేసుకోవాలని చెబుతున్నారు.

వాయిదా వేసుకున్నాం..
మా అబ్బాయి పెళ్లి మే నెలలో పెట్టుకున్నాం. కరోనాతో వాయిదా వేసుకున్నాం. ఇలాంటి సమయంలో పెళ్లి చేసి ఇబ్బంది పడేకంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం. లాక్‌డౌన్‌ మంచి నిర్ణయం. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి.
– గంగారాం

మళ్లీ వచ్చే ఏడాదే.. 
ఏప్రిల్‌ చివరిలో మా అన్న కుమార్తె పెళ్లి ఉండె. పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులూ కొన్నాం. ఏ ఒక్కటీ తక్కువ కావద్దని అన్నీ ముందే సమకూర్చుకున్నాం. కరోనా దెబ్బకు పెళ్లి వాయిదా వేసుకున్నాం. సెప్టెంబర్‌ లేదా వచ్చే ఏడాది చేయాలని నిర్ణయించుకున్నాం.  
– రాజు 

Advertisement
Advertisement