Sakshi News home page

ప్రాజెక్టులపై కేసులను వెనక్కి తీసుకోండి

Published Fri, Apr 13 2018 1:01 AM

Minister Harish Rao appealed to Congress leaders  - Sakshi

ఏటూరునాగారం: ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ నేతలు కోర్టులో వేసిన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయి గూడెం మండలం తుపాకులగూడెం పీవీ నర్సింహారావు సుజల స్రవంతి బ్యారేజ్‌ పనులను మంత్రి చందూలాల్‌తో కలసి గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కోర్టులో కాంగ్రెస్‌ నేతలు హర్షవర్ధన్‌రెడ్డి, దామోదర్‌ నర్సింహ, పవన్‌ కేసు వేశారని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలపై మీకు చిత్తశుద్ధి లేదా.. అని ఆయన ప్రశ్నించారు. వారు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు కాకపోతే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని ఉత్తమ్‌ను డిమాండ్‌ చేశారు. తుపాకులగూడెం బ్యారేజ్‌ని 2019 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. తుపాకులగూడెం బ్యారేజ్‌ వల్ల నిత్యం నీరు ఉండటం తో చేపల పెంపకం, టూరిజం శాఖ మంచిగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. భూగర్భ నీటి మట్టం పెరుగుతోందని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

కరెంటుకు అంతరాయం లేకుండా చూడాలి
బ్యారేజ్‌ పనుల కోసం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ నరేశ్‌ను మంత్రి ఆదేశించారు. బ్యారేజ్‌లో అమర్చే గేట్లను ఎత్తడానికి సరిపడా కరెంటు ఎంత అవసరం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

133/33 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మిస్తేనే గేట్లను ఎత్తడానికి కావాల్సిన కరెంటును సరఫరా చేయగలుగుతామని, అందుకు సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమి కావాలని నరేశ్‌ విన్నవించారు. దేవాదుల 220 కేవీ నుంచి నేరుగా ఈ నిర్మించబోయే సబ్‌స్టేషన్‌కు సరఫరా తీసుకుంటే ఎలాంటి అంతరాయం ఉండబోదని అధికారులు మంత్రికి వివరించారు. అందుకోసం కావాల్సిన స్థలాన్ని చూడాలని ఇంజనీరింగ్, రెవె న్యూ అధికారులను ఆదేశించారు.

Advertisement
Advertisement