కేసుల చిట్టా గాంధీభవన్‌కు పంపిస్తా | Sakshi
Sakshi News home page

కేసుల చిట్టా గాంధీభవన్‌కు పంపిస్తా

Published Sat, Aug 5 2017 1:58 AM

కేసుల చిట్టా గాంధీభవన్‌కు పంపిస్తా - Sakshi

- చదివి ఆత్మవిమర్శ చేసుకోండి
కాంగ్రెస్‌ నాయకులకు మంత్రి హరీశ్‌రావు హితవు
సీఎం కేసీఆర్‌ ఆవేదనను అర్థం చేసుకోలేరా? 
 
సాక్షి, సిద్దిపేట: మా ప్రభుత్వానికి ప్రజలే హైకమాండ్‌ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రతి పనికీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకుల మూలంగా ప్రాజెక్టులు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఇతర అభివృద్ధి ఆగిపోతోందని, ప్రతీది కోర్టులో కేసులు వేసి మోకాలడ్డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన చెందారని, దీన్ని కాంగ్రెస్‌ నాయకులు అర్థం చేసుకోకపోవడం శోచనీయమన్నారు.

గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఐదుగురు కాంగ్రెస్‌ నాయకులే కేసులు వేశారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో వాదిస్తున్నది కాంగ్రెస్‌ నాయకులు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కళాభారతి నిర్మించవద్దని, అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టవద్దని, అమరుల స్తూపం కట్టవద్దని, రోడ్డు వెడల్పు చేయవద్దని, హుస్సేన్‌సాగర్‌ ప్రక్షాళన చేయవద్దని కేసులు వేసింది ఎవరని హరీశ్‌ నిలదీశారు. పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వీటిని గాంధీభవన్‌కు పంపిస్తాం.. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చదువుకోవాలని సూచించారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడు, నల్లగొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఫ్లోరైడ్‌ బాధితులను పట్టించుకోనప్పుడు, తెలంగాణలో నిర్మించే థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు విజయవాడకు తరలించినప్పుడు, స్పెషల్‌ ప్యాకేజీ కింద చిత్తూరు జిల్లాకు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు మీ రోషం ఏమైందని ప్రశ్నించారు.

మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలను దేశ, విదేశాల ప్రతినిధులు, నీతి ఆయోగ్‌ కమిటీ ప్రశంసించిందని గుర్తు చేశారు. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయని, పంటలు ఎండిపోతుంటే వర్షాల కోసం ఎదురు చూసే దీనస్థితి నుంచి తెలంగాణ రైతాంగం బయట పడుతోందన్నారు. విలేకరుల సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement