అవ్వా.. నేనున్నా! | Sakshi
Sakshi News home page

అవ్వా.. నేనున్నా!

Published Wed, Feb 7 2018 2:05 AM

Minister Harish Rao given support to the elderly women - Sakshi

సిద్దిపేటజోన్‌: అధునాతన హంగులతో రూపుదిద్దుకున్న ఆధునిక రైతుబజార్‌.. అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమం జరుగుతోంది. అంతలో ఓ వృద్ధురాలు కాలూ చేయీ కూడదీసుకుంటూ ఓ కాగితం పట్టుకుని నేరుగా మంత్రి హరీశ్‌రావు ఉన్న సభా వేదికపైకి చేరుకుంది. ఆమె ఇచ్చిన కాగితాన్ని చదివిన ఆయన చలించిపోయారు. మొదట ఆ వృద్ధురాలిని తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించాలని వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం ఆమె సమస్యను జిల్లా కలెక్టర్‌కు అప్పగించి.. న్యాయం చేయాలని ఆదేశించారు. అధైర్యపడొద్దని, అండగా తానుంటానని ఆ పండుటాకుకు భరోసానిచ్చారు. ఆ కాగితంలో ఉన్న వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం సింగన్నగూడేనికి చెందిన వీరస్వామిగౌడ్, వెంకటమ్మ భార్యాభర్తలు. భర్త కొద్ది కాలం క్రితం మరణించాడు.  

ఆమె పేరిట మూడు ఎకరాల 20 గుంటల భూమి ఉంది. అందులో కొంత  పెద్ద కుమారుడు రాములుగౌడ్‌ ఫోర్జరీ పట్టాలు సృష్టించి సొంతం చేసుకున్నాడు. తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. ఆదరించే వారు లేక ఆమె కడుపు నింపుకొనేందుకు నానా అగచాట్లు పడుతోంది. ఆదరించాల్సిన కొడుకు అడుక్కుతినే పరిస్థితికి తెచ్చాడంటూ వెంకటమ్మ తన చిన్న కుమారుడితో కలసి సోమవారం మంత్రి హరీశ్‌రావును కలిసింది. ఓ లేఖను ఆయనకు అందించింది. అది మొత్తం చదివిన మంత్రి.. ఆమెను మొదట తన ఇంటికి పంపించారు. కడుపు నిండా అన్నం పెట్టించి.. సాయంత్రం కలెక్టరేట్‌కు తీసుకురావాల ని సిబ్బందికి సూచించారు. రాత్రి ఆయన కలెక్టరేట్‌లో సమీక్షలో ఉండగా, వెంకటమ్మ అక్కడకు వచ్చింది. విషయం తెలుసుకున్న మంత్రి.. సమీక్ష మధ్యలోనే బయటకు వచ్చారు. కలెక్టర్, జేసీలను పిలిపించి ఆమె ఇచ్చిన లేఖను ఆయన వారికి చదివి వినిపించారు. ‘అమ్మకు న్యాయం చేయండి. విచారణ చేపట్టి.. తల్లిని రోడ్డుకీడ్చిన కొడుకును జైలుకు పంపించడానికి వెనుకాడకండి’అని ఆదేశించారు. వృద్ధురాలితో ‘అమ్మా! అధైర్యపడకు. నీకు నేనున్నాను’ అని ధైర్యం చెప్పారు.

ఇంత జాప్యమా..?
కోనరావుపేట(వేములవాడ): కాళేశ్వరం ఎత్తిపోతల ప్యాకేజీ–9 పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లోగా పూర్తికావాల్సిన పనుల్లో 20 శాతమే పూర్తికావడం ఏమిటని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే జేఈ, డీఈ, ఏఈలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చేపట్టిన మల్క పేట రిజర్వాయర్‌ పనులను మంత్రి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పనుల్లో క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల నివేదికలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు చేయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఈఈ బుచ్చిరెడ్డిపై మండిపడ్డారు. పక్షంరోజుల్లోగా పురోగతి కనిపించకపోతే వేరే ఏజెన్సీకి పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. నిర్దేశిత గడువులోగా కాళేశ్వరం ఎత్తిపోతల–9 ప్యాకేజీ పనులు పూర్తిచేసి ఈ ఏడాదిలోగా జిల్లా ప్రజలకు నీళ్లు అందించాలని సూచించారు.

Advertisement
Advertisement