‘కొండపోచమ్మ సాగర్‌’ ఓ రికార్డు | Sakshi
Sakshi News home page

‘కొండపోచమ్మ సాగర్‌’ ఓ రికార్డు

Published Mon, Apr 2 2018 3:15 AM

Minister Harish Rao tour in the Gajwel constituency - Sakshi

గజ్వేల్‌: ‘గతంలో ఒక్క టీఎంసీ ప్రాజెక్టు కట్టాలన్నా పది, పదిహేనేళ్ల కాలం పట్టేది. అయినా అవి పూర్తవుతాయో లేదో తెలియని దుస్థితి. ఇప్పుడు ఏడాదిలోనే భూ సేకరణతోపాటు పనులు పూర్తి చేసి నీళ్లు అందించబోతున్న ప్రాజెక్టుగా కొండపోచమ్మ సాగర్‌ దేశంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకోబోతోంది’అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ పనులు, మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌ పనులను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొండ పోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామన్నారు. దీని ద్వారా సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గంతోపాటు మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు ప్రయోజనం కలగనుందని చెప్పారు.

హైదరాబాద్‌కు తాగు నీటిని సరఫరా చేసేందుకూ ఈ ప్రాజెక్టును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. కాలువల పనులకు సంబంధించి వారం రోజుల్లో టెండర్లను పిలిచి పను లను ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్‌ మండలం అక్కారం వద్ద కొండపోచమ్మ సాగర్‌కు నీటిని అందించే పంప్‌ హౌస్‌ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 3.4 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు జరగాల్సి ఉన్నా.. 86.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులే జరిగాయని, మిగతా పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియ 99 శాతం పూర్తయిందన్నారు. రైతుల్లో అపోహలు సృష్టించి భూములు ఇవ్వకుండా చేయడానికి జేఏసీ చైర్మన్‌ కోదండరాం, కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రజలు సహకరిస్తున్నారన్నారు. 

వచ్చే జనవరి నాటికి గజ్వేల్‌కు రైలు..  
మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌ పనులను 2019 జనవరి నాటికి పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ రైల్వే లైన్‌ నిర్మాణ పనులను ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట, మెదక్‌ కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, ధర్మారెడ్డి, ‘గడా’ఓఎస్‌డీ హన్మంతరావు, రైల్వేశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ అతుల్‌ కంకనే, డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ సుబ్రహ్మణ్యంతో కలిసి పరిశీలించారు. గతేడాది ఈ లైన్‌ నిర్మాణానికి కేంద్రం రూ.60 కోట్లు ఖర్చు చేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద మూడో వంతు భరిస్తోందన్నారు.  గజ్వేల్‌ వరకు లైన్‌ పూర్తయితే ఈ ప్రాంత రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైల్వేలైన్‌ నిర్మాణానికి అవరోధంగా పరిణమించిన విద్యుత్‌ స్తంభాల షిఫ్టింగ్, బ్రిడ్జీల నిర్మాణం తదితర అంశాలపై ఆదేశాలిస్తూ ముందుకు సాగారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement