సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు | Sakshi
Sakshi News home page

సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయొద్దు

Published Fri, Nov 8 2019 4:01 AM

Minister KTR Meeting With ST Entrepreneurship Beneficiaries - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సబ్సిడీల కోసం కాకుండా ఆసక్తి, పట్టుదలతో వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారి కోసం రాష్ట్రంలోని ఇండస్ట్రీయల్‌ పార్కుల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్‌ పార్కుల్లో గ్రామీణ యువత, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పథకం కింద 2019 బ్యాచ్‌ కోసం ఎంపిక చేసిన 100 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తూ కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరని, ఇప్పటికే కొందరు ఔత్సాహిక యువ గిరిజన పారిశ్రామికవేత్తలు దీనిని నిరూపించారన్నారు. గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి ఎప్పుడూ కలగలేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఐఎస్‌బీలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో ఏర్పాటయ్యే పరిశ్రమల ప్రారంభోత్సవానికి తనతోపాటు సెలబ్రిటీలనూ వెంట తీసుకొస్తానని అన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఈ పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

ఐఎస్‌బీలో నిలబడే అవకాశమిచ్చారు: సత్యవతి రాథోడ్‌ 
గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన ‘సీఎం ఎస్టీ ఎంట్రప్రెన్యూర్‌ అండ్‌ ఇన్నొవేషన్‌ స్కీం’ద్వారా ఐఎస్‌బీలో నిలబడి మాట్లాడే అవకాశం గిరిజనులకు దక్కిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ కార్యదర్శి బెన్‌హర్‌ మహేశ్‌దత్‌ ఎక్కా, కమిషనర్‌ డాక్టర్‌ క్రిస్టినా చోంగ్తు, ఎస్‌బీఐ డీజీఎం దేబాశిష్‌ మిశ్రా, ఐఎస్‌బీ డీన్‌ రాజేంద్ర శ్రీవాస్తవ పాల్గొన్నారు.

Advertisement
Advertisement