ప్రభుత్వం పారిపోతుందా?: మంత్రి ఆగ్రహం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పారిపోతుందా?: మంత్రి ఆగ్రహం

Published Thu, Jun 29 2017 9:12 PM

ప్రభుత్వం పారిపోతుందా?: మంత్రి ఆగ్రహం - Sakshi

నిజామాబాద్‌: ‘‘ప్రభుత్వం ఏమైనా పారిపోతుందా..? రైతుల రుణ మాఫీ సొమ్ము రూ.16,500 కోట్లు పువ్వుల్లో పెట్టి బ్యాంకులకు జమ చేశాం. తల తాకట్టు పెట్టయినా సరే మొండి బకాయిల డబ్బులు కూడా బ్యాంకులకు జమ చేశాం.. అయినా బ్యాంకర్ల తీరు మారడం లేదు. రూ.లక్ష కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతుల వద్ద వడ్డీ మాఫీ డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రూ.16 వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వం రూ.200 కోట్లు వడ్డీ మాఫీ డబ్బులు చెల్లించదా..?’’ అని  మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లపై మండిపడ్డారు.

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన రుణమాఫీ డబ్బులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ రైతుల ఖాతాల్లో జమ చేయకుండా జాప్యం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పంట బీమా పథకం గ్రామం యూనిట్‌గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. త్వరలో రాష్ట్రంలో క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేస్తామని, స్థానిక వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌) సహకారం తీసుకుంటున్నామని వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement