చందూలాల్‌కు క్లియర్ | Sakshi
Sakshi News home page

చందూలాల్‌కు క్లియర్

Published Tue, Dec 16 2014 2:38 AM

చందూలాల్‌కు క్లియర్

గిరిజన సంక్షేమ శాఖ దక్కే అవకాశం
పార్లమెంటరీ సెక్రటరీగా వినయభాస్కర్
తుది ప్రయత్నాల్లో సురేఖ

 
వరంగల్ : రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు మరో పదవి ఖాయమైంది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్‌కు కేబినెట్‌లో చోటు ఖరారైందని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం కేసీఆర్.. ఈ నెల 11న జరిగిన గిరిజన భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖను గిరిజనుడికి అప్పగిస్తామని ప్రకటించారు. దీని ప్రకారం చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ దక్కనుంది. మంత్రి పదవి విషయంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు వినిపిస్తోంది. కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించే విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఆధారంగా సురేఖకు మంత్రి పదవిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమెకు మంత్రి పదవి బదులు.. ఆమె భర్త కొండా మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండుకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సురేఖకు మంత్రి   పదవి దక్కకపోతే మురళీధర్‌రావుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని గులాబీ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. మంత్రి పదవి ఆశించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రెటరీ పదవి ఖాయమైందని టీఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. మంగళవారం జరగునున్న మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత వెలువడే ఉత్తర్వులతో జిల్లా ఎమ్మెల్యేలకు దక్కే పదవులపై పూర్తి స్పష్టత రానుంది.

పార్లమెంటరీ సెక్రటరీ..

పార్లమెంటరీ సెక్రటరీకి రాష్ట్ర సహాయ మంత్రి హోదా ఉంటుంది. ముఖ్యమంత్రి ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ మంత్రులతో సమానంగానే ఉంటాయి. ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. ముఖ్యమంత్రికి, మంత్రులకు వీరు సహకరిస్తారు. వీరికి కేటాయించిన శాఖలకు రాజకీయ అధిపతులుగా వ్యవహరిస్తారు. సమీక్షలు నిర్వహించి ఆదేశాలిస్తారు. ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు. కార్యాలయాల కేటాయింపుతోపాటు బుగ్గ కార్లు, జీతభత్యాలు గౌరవమర్యాదలు, ఇతర వసతులు వర్తిస్తాయి. సీఎం అనుమతిస్తే కేబినెట్ సమావేశాల్లో పాల్గొంటారు. పార్లమెంటరీ కార్యదర్శులుగా వీరితో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరికి శాఖల కేటాయింపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన జారీ చేస్తారు. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం తెలంగాణలో ఇదే మొదటిసారి. మర్రిచెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా ఉన్న 1978-80లో పార్లమెంటరీ సెక్రెటరీ పదవులు ఉన్నాయి.
 
పేరు : అజ్మీరా చందూలాల్
పుట్టిన తేదీ : 08-07-1954
విద్యార్హతలు : ఇంటర్మీడియెట్
తల్లిదండ్రులు : మీటూనాయక్, మీరాబాయి
భార్య : శారద
పిల్లలు : పద్మాదేవి, ధరంసింగ్, ప్రహ్లాద్, ప్రవీణ్
సామాజిక వర్గం:  ఎస్టీ(లంబాడా)
స్వస్థలం : సారంగపల్లి, జగ్గన్నపేట గ్రామపంచాయతీ, ములుగు మండలం.
 
రాజకీయ నేపథ్యం..
 
1981లో జగ్గంపేట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
1983లో టీడీపీలో చేరారు.
1985, 1994లో టీడీపీ అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1989లో టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు.
1994,1996 టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
1996,1998లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు.(అప్పుడు జనరల్ స్థానం)
2001లో ట్రైకార్ చైర్మన్‌గా మూడేళ్లు చేశారు.
1983, 1989, 1999 ఎన్నికల్లో ములుగు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓటమిపాలయ్యారు.
2005లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యవహరిస్తున్నారు.
2009లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల్లో ములుగు నుంచి 16,399 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
 

Advertisement
Advertisement