మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’ | Sakshi
Sakshi News home page

మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’

Published Sun, Mar 22 2015 2:46 AM

మంత్రుల క్వార్టర్స్ మరమ్మతు నిధులకు ‘టెండర్’

ముందు టెండర్... ఆ తర్వాత నామినేషన్‌కు బదలాయింపు
లెస్‌కు టెండర్లు దాఖలైనావింత ధోరణి
అన్ని క్వార్టర్లకూ ఒకే మొత్తానికి ప్రతిపాదనలు
రోడ్లు, భవనాల శాఖలో ఇష్టారాజ్యం

 
హైదరాబాద్: రోడ్లు భవనాల శాఖ అంటేనే ఇష్టారాజ్యానికి చిరునామా. నిబంధనలు, పొదుపు చర్యలు, నాణ్యతకు అక్కడ అంత ప్రాధాన్యం ఉండదు. సొంత కార్యాలయం కోసం నిర్మిస్తున్న భారీ భవనం విషయంలో అడ్డగోలుగా అంచనాలు పెంచేసి రూ.20 కోట్ల పనిని రూ.67 కోట్లకు చేర్చిన అధికారులు.. తాజాగా మంత్రుల నివాసాల్లో మరమ్మతుల విషయంలో వింతగా వ్యవహరించారు. అడ్డగోలు విధానాల్లో తమకు హద్దే లేదని నిరూపించారు.
 
ఇదీ సంగతి...

మంత్రులకు కేటాయించిన కొన్ని క్వార్టర్లలో మరమ్మతులు జరపాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 16, 17 తేదీల్లో రోడ్లు, భవనాల శాఖ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ ఈ ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో ఆన్‌లైన్ టెండర్లు పిలిచింది. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, జగదీశ్వర్ రెడ్డి, నాటి డిప్యూటీ సీఎం రాజయ్య, శాసనసభ ఉప సభాపతి పద్మా దేవేందర్, సీఎల్పీ నేత జానారెడ్డిల క్వార్టర్లకు మరమ్మతు జరుపుతున్నట్టు టెండర్‌లో పేర్కొం ది. సాధారణంగా ఆయా క్వార్టర్లలో ఉండే సమస్యల ఆధారంగా పనులు జరుపుతారు. వెరసి పనులు వేరువేరుగా ఉంటాయి. కానీ విచిత్రమేంటంటే... ఈ అన్ని పనులకు రూ.7,10,720 చొప్పున ప్రతిపాదించారు. అన్నింటికి పైసల్లో కూడా తేడా లేకుండా ఒకేమొత్తం ఎలా అవసరమవుతుందో అధికారులకే తెలియాలి. వీటిల్లో దాదాపు అన్ని పనులకు కొందరు కాంట్రాక్టర్లు లెస్‌కు కొటేషన్లు దాఖలు చేశారు.

ఆ ప్రకారం తక్కువ మొత్తం కోట్ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఆ తర్వాత పరిపాలన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. విచిత్రమేంటంటే... ఇందులో కొన్ని క్వార్టర్ల టెండర్లను ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ పేరు చెబుతూ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను తోచిన వ్యక్తులకు నామినేషన్‌పై ఇచ్చేసుకున్నారు. అత్యవసర పనులైనందున,  నామినేషన్ కింద కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచిత్రమేంటంటే కొన్ని పనుల నామినేషన్ ఉత్తర్వు గత ఫిబ్రవరి 2న వెలువడితే, కొన్నిం టిది నిరుడు నవ ంబరులో విడుదలైంది. వీటన్నిటికీ టెండర్లు ఒకేసారి పిలిచారు అయినా.. కొన్ని అత్యవసరమెలా అవుతాయి, వాటికి గడువు లేని పరిస్థితి ఎలా ఉత్పన్నమవుతుందో అధికారులే చెప్పాలి.

టెండర్ల సమయంలోనే ఆరోపణలు

ఎక్కువ మొత్తం లెస్‌కు కోట్ చేసి కాంట్రాక్టర్లు రింగుగా మారి టెండర్లు దక్కించుకున్నారని ఆదిలోనే ఆరోపణలు వచ్చాయి. వాటిని రద్దు చేసి మళ్లీ పిలవాలంటూ కొందరు కాంట్రాక్టర్లు చీఫ్‌ఇంజనీర్‌కు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే 30 శాతం, 28 శాతం లెస్‌కు టెండర్లు దాఖలైన వాటిని కొనసాగిస్తూ 16 శాతం లెస్‌కు దాఖలైన వాటిని రద్దు చేసి నామినేషన్ పేర అప్పగించారు. అయితే ఈ పనుల్లో కొన్ని పూర్తయిన తర్వాత నామినేషన్ డ్రామాకు తెర తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
 

Advertisement
Advertisement