మైనర్లు పదిహేను మందే.. ! | Sakshi
Sakshi News home page

మైనర్లు పదిహేను మందే.. !

Published Mon, Jul 27 2015 12:40 AM

మైనర్లు పదిహేను మందే.. !

- 55 మందిని ఇంటికి పంపిన పోలీసులు
- ఏజెంట్ల కోసం ఆరా
సికింద్రాబాద్ :
శనివారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 70 మంది కార్మికుల్లో పదిహేను మంది మాత్రమే మైనర్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో 200 మంది బాలకార్మికులు వస్తున్నట్టు బాలల హక్కుల కమిషన్ ప్రతినిధులకు అదే రైలులోని ఓ ప్రయాణికుడు సమాచారం అందించారు. స్పందించిన కమిషన్ ప్రతినిధులు 150 మంది పోలీసుల సహకారంతో జన్మభూమి రైలులో వచ్చిన 70 మందిని అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చత్తీస్‌ఘడ్, ఒడిసా, బిహార్‌కు చెందిన వారంతా నగరంలోని దోమల మందు, ప్లాస్టిక్ వస్తువుల తయారీ కర్మాగారాల్లో పనిచేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నార్త్‌జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఒక్కో బాలుడితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐదు నుంచి పదివేల వేతనానికి ఏడాది కాలం పనిచేసేందుకు తమను తమ తల్లిదండ్రులే ఏజెంట్ల ద్వారా ఇక్కడికి పంపినట్టు పలువురు బాలలు తెలిపారు. బాలకార్మికుల వద్ద అందుబాటులో ఉన్న ఆధార్‌కార్డుల ఆధారంగా పోలీసులకు పట్టుబడిన 55 మందికి 18 సంవత్సరాల వయసు దాటినట్టు గుర్తించారు. వారందరిని తమతమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందిగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.
 
హోమ్‌కు 15 మంది..

పది హేను మంది బాలలను దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో కూకట్‌పల్లిలోని ‘స్వధార్’ సంస్థకు చెందిన బాలల ఆశ్రమానికి తరలించారు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు స్వీకరించి వారికి సమాచారం అందించామని, వారిని నగరానికి రప్పించి బాలలను అప్పగిస్తామని డీసీపీ ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

Advertisement
Advertisement