మనోళ్లు నలుగురు | Sakshi
Sakshi News home page

మనోళ్లు నలుగురు

Published Tue, Jun 10 2014 2:51 AM

మనోళ్లు నలుగురు

- ఇద్దరు గల్లంతు   
- మరో ఇద్దరు సురక్షితం
- హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటన
 
కరీంనగర్ రూరల్/కరీంనగర్ క్రైం: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో  ఆదివా రం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మన జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు గల్లం తుకాగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయి. సురక్షితంగా బయటపడ్డ వారు స్వగ్రామాలకు బయలుదేరారు. కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి అనే ఇంజినీరింగ్ విద్యార్థి  గల్లంతైనట్లు తెలవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.

తండ్రి రాజిరెడ్డి తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంఘటన స్థలానికి బయలుదేరారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్‌పల్లెకు చెందిన దాసరి రాజిరెడ్డి వ్యాపార నిమిత్తం 15 ఏళ్ల క్రితం కరీంనగర్ వచ్చారు. ప్రస్తుతం రేకుర్తిలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.  శ్రీనిధి వీఎన్‌ఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. ఈనెల 2న శ్రీనిధి హైదరాబాద్‌కు వెళ్లింది. మరుసటి రోజు సహచర విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది.

 

ఆదివారం సాయంత్రం 4 గం టలకు తండ్రి రాజిరెడ్డికి ఫోన్ చేసి కులుమనాలిలో ఉన్నట్లు చెప్పింది.అంతలోనే ఇంజినీరింగ్ విద్యార్ధులు నదిలో గల్లంతైనట్లు టీవీల్లో వార్తలు రావడంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు.  శ్రీనిధి స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేయడంతో గల్లంతైన విషయం తెలిసింది. రాజిరెడ్డి ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలికి బయలుదేరారు. సోమవారం సాయంత్రం 6.20 గంటలకు అక్కడికి చేరుకున్నారు. రాత్రి కావడంతో డ్యాం వద్దే ఉంచారని, తెల్లవారుజామునే రేస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటామని రాజిరెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
 
మాట్లాడిన కొద్ది సేపటికే
‘నా బిడ్డ ఉదయం 10.30 గంటలకు ఫొన్ చేసి మాట్లాడింది. సాయంత్రం కులుమనాలికి చేరుకుంటాం..మళ్లీ కాల్ చేస్తామన్నది. సాయంత్రం 4 గంటలకు కాల్ చేసి మరికొద్ది సేపటిలో కులుమనాలి చేరుకుంటామని చెప్పి కట్ చేసింది. ఫొన్ చేస్తుందని ఎదురుచూస్తుండగా గల్లంతయిందన్న వార్త వచ్చింది’ అంటూ రోదిస్తూ దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కారులోనే నాంపల్లి రైల్వేస్టేషన్ వరకు దింపి వచ్చానని చెప్పాడు. ప్రతిరోజు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య మాట్లాడుతుందని కూతురు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదించారు.

Advertisement
Advertisement